
40 ఏళ్ల తర్వాత విశాఖ జూలో బ్లాక్ పాంథర్
విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ (ఐజీజెడ్పీ)లో సరికొత్త సందడి నెలకొంది. సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అత్యంత అరుదైన నల్ల చిరుత (బ్లాక్ పాంథర్) పర్యాటకుల ముందుకు వచ్చింది. అస్సాం రాష్ట్ర జూతో కుదుర్చుకున్న జంతు మార్పిడి ఒప్పందంలో భాగంగా ఈ ఆడ నల్ల చిరుతను విశాఖకు తీసుకువచ్చారు. మంగళవారం జూ క్యూరేటర్ జి. మంగమ్మ దీనిని అధికారికంగా నూతన ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా క్యూరేటర్ మంగమ్మ మాట్లాడుతూ 1980వ దశకం తర్వాత మళ్లీ ఇప్పుడే విశాఖ జూలో నల్ల చిరుత అడుగుపెట్టిందని ఇది జూ చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భమని పేర్కొన్నారు. ఈ అరుదైన అతిథి రాకతో జీవ వైవిధ్య పరిరక్షణలో ఐజీజెడ్పీ మరో కీలక మైలురాయిని చేరుకుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం వినోదమే కాకుండా వన్యప్రాణి సంరక్షణపై విద్యావేత్తలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఇది గొప్ప అవకాశమని ఆమె పేర్కొన్నారు.
ఇక ఈ నల్ల చిరుత రాకతో పాటు మరో ఆసక్తికర అంశం అందరినీ ఆకట్టుకుంది. కేవలం 21 నెలల వయసున్న ఎం. నిహిరా అనే చిన్నారి ఈ అరుదైన నల్ల చిరుతను దత్తత తీసుకోవడం విశేషం. జంతు దత్తత కార్యక్రమంలో భాగంగా ఆ పాప కుటుంబ సభ్యులు ఒక ఏడాది కాలానికి గాను రూ.1.25 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో జూ అధికారులకు అందజేశారు. ఇంత చిన్న వయసులోనే వన్యప్రాణులపై మక్కువ చూపి దత్తతకు ముందుకు రావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
మెరుగైన వసతులతో కొత్త ఎన్‌క్లోజర్లు
నల్ల చిరుతతో పాటు జూలోని ఇతర జంతువుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి పనులను చేపట్టారు. స్లోత్ బేర్, తోడేలు, జాకల్,రెడ్-నెక్‌డ్ వాలబీ వంటి జంతువుల కోసం ఆధునిక హంగులతో నిర్మించిన నూతన ఎన్‌క్లోజర్లను అధికారులు ప్రారంభించారు. జంతువుల సహజ ఆవాసాలకు అద్దం పట్టేలా వాటికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ వసతులను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో వన్యప్రాణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు.
