Let's talk: editor@tmv.in
మరుగుజ్జు గెలాక్సీల్లోనూ కృష్ణబిలాలు!

మరుగుజ్జు గెలాక్సీల్లోనూ కృష్ణబిలాలు!

Shaik Mohammad Shaffee
18 ఏప్రిల్, 2026

విశ్వాంతరాళంలో అంతుచిక్కని రహస్యాలను ఛేదించడంలో భారతీయ శాస్త్రవేత్తలు మరో కీలక అడుగు వేశారు. విశ్వంలోని అతి చిన్న గెలాక్సీలుగా పిలవబడే మరుగుజ్జు గోళాకార గెలాక్సీల్లోనూ కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ఉండే అవకాశం ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) పరిశోధకులు వెల్లడించారు. పాలపుంత చుట్టూ పరిభ్రమించే ఈ చిన్న గెలాక్సీల అధ్యయనం ద్వారా, కాలక్రమేణా గెలాక్సీలు ఎలా అభివృద్ధి చెందాయనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సరికొత్త నమూనాతో పరిష్కారం

సాధారణంగా భారీ గెలాక్సీల మధ్యలో అతి భారీ కృష్ణబిలాలు ఉండటం సహజం. అయితే, మరుగుజ్జు గెలాక్సీలు చాలా మసకగా ఉండటమే కాకుండా, అందులో వాయువులు తక్కువగా ఉండి, 'చీకటి పదార్థం' ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అక్కడ కృష్ణబిలాలను నేరుగా గుర్తించడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.

ఈ అడ్డంకిని అధిగమించడానికి ఐఐఏకు చెందిన శాస్త్రవేత్తలు కె. ఆదిత్య, అరుణ్ మంగళం ఒక వినూత్న పద్ధతిని అనుసరించారు. వారు నక్షత్రాలు, డార్క్ మ్యాటర్ హాలో, కృష్ణబిలం.. ఈ మూడింటి గురుత్వాకర్షణ ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఒక 'డైనమికల్ మోడల్'ను రూపొందించారు. నక్షత్రాల కదలికల ఆధారంగా, ఆ గెలాక్సీల కేంద్రంలో ఉండే కృష్ణబిలం బరువు ఎంత ఉండవచ్చో వారు అంచనా వేశారు.

'ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్'లో ప్రచురణ

ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 'స్టెల్లార్ అనిసోట్రోపి' అనే పద్ధతిని ఉపయోగించారు. అంటే నక్షత్రాల వేగం వేర్వేరు దిశల్లో ఎలా ఉందో లెక్కగట్టి, తద్వారా కృష్ణబిలం ద్రవ్యరాశిపై బలమైన పరిమితులను విధించారు. వీరి పరిశోధన ఫలితాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్ 'ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్'లో ప్రచురితమయ్యాయి.

పరిశోధనలోని ప్రధానాంశాలు

మరుగుజ్జు గెలాక్సీల మధ్యలో ఉండే కృష్ణబిలాలు సూర్యుడి ద్రవ్యరాశి కంటే గరిష్టంగా పది లక్షల రెట్ల లోపే ఉంటాయని ఈ అధ్యయనం ద్వారా తేలింది. ఈ గెలాక్సీల్లో భారీ కృష్ణబిలాలు ఉండకపోవచ్చు కానీ, మధ్యస్థ స్థాయి కృష్ణబిలాలు ఉండేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయని అరుణ్ మంగళం వివరించారు. గెలాక్సీ చిన్నదైనా, పెద్దదైనా దాని పరిమాణానికి, అందులోని కృష్ణబిలం బరువుకు మధ్య ఒకే రకమైన నిష్పత్తి ఉంటుందని ఈ పరిశోధన నిరూపించింది. ఈ ఏకీకృత సూత్రం ద్వారా విశ్వం ఎలా ఆవిర్భవించింది? కృష్ణబిలాలు ఎలా పెరుగుతాయి? అనే రహస్యాలను ఛేదించడం సులభం కానుంది.

భవిష్యత్ అన్వేషణకు దిక్సూచి

ఈ అధ్యయనం కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో రాబోయే 'నేషనల్ లార్జ్ ఆప్టికల్ టెలిస్కోప్', 'ఎక్స్‌ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్' వంటి శక్తివంతమైన పరికరాల ద్వారా చేసే పరిశోధనలకు ఒక మార్గదర్శిగా నిలవనుంది.

విశ్వం పుట్టిన కొత్తలో గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి? కాలక్రమేణా కృష్ణబిలాలు ఎలా పెరిగాయి? అనే ప్రశ్నలకు సమాధానం వెతకడంలో మా పరిశోధన కీలకం కానుంది" అని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాలపుంత వంటి పెద్ద గెలాక్సీల గురుత్వాకర్షణ ప్రభావం వల్ల చిన్న గెలాక్సీలు తమలోని నక్షత్రాలను కోల్పోయే ప్రక్రియను (టైడల్ స్ట్రిప్పింగ్) కూడా ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు విశ్లేషించారు.