
బీజేపీ ఆలోచన వచ్చే ఎన్నికల గురించి కాదు.. వచ్చే తరాల భవిష్యత్తు కోసమే: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం తమ పనిలోనే కాకుండా, వారి ఉద్దేశాల్లోనూ ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో ఉన్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. బీజేపీ ఎల్లప్పుడూ వచ్చే ఎన్నికల గురించి కాదు.. రాబోయే తరాల భవిష్యత్తు గురించే ఆలోచిస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఇంటెలెక్చువల్స్ మీట్’ సికింద్రాబాద్‌లో జరిగిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ సమ్మేళనం’లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
భారతదేశ బడ్జెట్‌లోని ప్రతి రూపాయి దేశ భద్రతను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతోందని, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందనే ఆందోళన మాకు లేదు, కానీ రాబోయే తరాలకు ఏం జరుగుతుందనేదే మా ప్రాధాన్యత. మా ఉద్దేశాలు చాలా స్పష్టం. మా మాటలకు, చేతలకు మధ్య ఎలాంటి తేడా లేదని ఆయన అన్నారు.
రాజకీయాల్లో ఒక నాయకుడికి ఉన్న అతిపెద్ద ఆస్తి ‘విశ్వసనీయత’ అని పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో నెలకొన్న విశ్వసనీయత సంక్షోభాన్ని ఒక సవాలుగా తీసుకుని నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమేనన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వారికి పశ్చిమ బెంగాల్‌లో ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో ఇటీవలే అందరూ చూశారని ఆయన గుర్తుచేశారు.
గత కాంగ్రెస్ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో 2జీ స్కామ్, కోల్ స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ వంటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల వార్తలు లేకుండా ఒక్క రోజు కూడా గడిచేది కాదు. కానీ ప్రధాని మోడీ బాధ్యతలు చేపట్టగానే తాను అవినీతికి పాల్పడనని, ఎవరినీ పాల్పడనివ్వనని స్పష్టం చేశారు. నా హోంమంత్రి పదవీకాలంలో రూ. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ నుంచి, నేడు రక్షణ బడ్జెట్ ఏకంగా రూ. 8 లక్షల కోట్లకు పెరిగిందని రక్షణ మంత్రి వివరించారు. హైదరాబాద్‌లోని మేధావుల ఉత్సాహాన్ని చూస్తుంటే, భారతదేశంలో ప్రజల ఆశీస్సులు, ఆదరణ ఉన్న ఏకైక కూటమి బీజేపీ-ఎన్డీయే మాత్రమేననే తన నమ్మకం మరింత బలపడిందని రాజ్‌నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.
