
బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణే: ఎంపీ ఈటల రాజేందర్
భారతీయ జనతా పార్టీ తదుపరి లక్ష్యం తెలంగాణేనని, రాష్ట్రంలో కాషాయ విప్లవం మొదలైందని ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని గాయత్రి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే మార్పులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో బీఆర్ఎస్ పాలన వద్దనుకుని ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే, రెండేళ్లలోనే ఆ పార్టీ అసమర్థత తేలిపోయిందని ఈటల విమర్శించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలన్నా, నియంతృత్వ పోకడలు అంతం కావాలన్నా బీజేపీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, త్వరలోనే 23వ రాష్ట్రంగా తెలంగాణలో పాగా వేస్తుందని, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని తెలిపారు.
మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వస్తున్న నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికేందుకు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. నేడు జరిగే బహిరంగ సభకు మల్కాజిగిరి నుండే లక్ష మంది హాజరవుతారని, దీనికోసం 1,000 బస్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. గత ఎన్నికల్లో కంటోన్మెంట్‌లో ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయినా, మోడీ ప్రభావంతో ఎంపీ ఎన్నికల్లో 25 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని, అదే ఉత్సాహంతో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, కార్యకర్తలు, నాయకులు ప్రజలతో కలిసి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. దాడులు, దూషణలు తమ సంస్కృతి కాదని, సంస్కారవంతమైన రాజకీయాలే బీజేపీ గుర్తింపు అని ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు.
