Let's talk: editor@tmv.in
బీజేపీది పితృస్వామ్య భావజాలం: అఖిలేష్

బీజేపీది పితృస్వామ్య భావజాలం: అఖిలేష్

Pinjari Chand
30 ఏప్రిల్, 2026

మహిళల రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంలోని బీజేపీ, దాని మిత్రపక్షాలపై సమాజవాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఎక్సెసివ్ కండెమ్నేషన్ రిజల్యూషన్’ పేరుతో ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ఆయన బీజేపీ విధానాలను తీవ్రంగా ఖండించారు. మహిళల రిజర్వేషన్ పేరుతో వాస్తవానికి డీలిమిటేషన్ బిల్లును దాచిపెట్టి ఎన్నికల్లో లాభం పొందాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. మహిళల సాధికారత లక్ష్యంగా కాకుండా, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మహిళల రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయనే ఆరోపణలను ఖండించిన యాదవ్, అన్ని పార్టీల మద్దతుతో ఆ బిల్లు ఆమోదించిందని, కానీ ఆమోదం పొందని బిల్లు డీలిమిటేషన్ బిల్లేనని స్పష్టం చేశారు.

మహిళల రాజకీయ ప్రాతినిధ్యంలో వెనుకబడిన వర్గాలు, మైనారిటీ మహిళలకు స్పష్టమైన నిబంధనలు లేవని విమర్శించారు. బీజేపీ ‘శక్తివంతుడే గెలుస్తాడు’ అనే సామంత దృక్పథంతో వ్యవహరిస్తోందని అన్నారు. బీజేపీకి చెందిన పితృస్వామ్య భావజాలం మహిళలకు గౌరవం, స్వేచ్ఛ ఇవ్వదని ఆరోపిస్తూ, మహిళలను సామాజిక, కుటుంబ, ప్రజా వేదికలపై అవమానించే ధోరణి ఉందని పేర్కొన్నారు. మహిళల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే వారి లక్ష్యమని విమర్శించారు. మహిళలపై నేరాలు చేసే వారిని బీజేపీ నాయకులు గౌరవిస్తున్నారని, దేశంలోని పహల్‌గామ్, హాథ్రాస్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలను ఉదాహరణగా చూపుతూ బీజేపీని ‘మహిళా వ్యతిరేక పార్టీ’గా అభివర్ణించారు.

మహిళల పేరుతో బీజేపీ నాటకాలు

మహిళల గౌరవం పేరుతో నాటకాలు ఆడుతూ, వాస్తవానికి వారిని అవమానిస్తున్నారని ఆరోపించారు. స్త్రీ–పురుష సమానత్వంపై చర్చలకు అనుకూల వాతావరణం సృష్టించడంలో బీజేపీ విఫలమైందని అన్నారు. మహిళలను మహిళలతోనే పోటీ పడేలా చేసి ఐక్యతను దెబ్బతీస్తోందని విమర్శించారు. ఉద్యోగ ప్రదేశాల్లో కూడా మహిళలకు అనుకూల వాతావరణం కల్పించడం లేదని, వారికి సరైన అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మహిళల స్వేచ్ఛను పరిమితం చేయాలని, వారి జీవనశైలిపై నియంత్రణలు విధించాలని బీజేపీ భావజాలం ప్రయత్నిస్తోందని అన్నారు. మహిళలకు హక్కులు ఇవ్వకుండా, వారిని కేవలం నినాదంగా ఉపయోగించి రాజకీయ లాభం పొందాలని బీజేపీ చూస్తోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు.

బీజేపీది పితృస్వామ్య భావజాలం: అఖిలేష్ - Tholi Paluku