
అస్సాంలో బీజేపీ దూకుడు ..బెంగాల్‌లో టఫ్ ఫైట్, తమిళనాడులో డీఎంకే రిటర్న్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తించాయి. అస్సాంలో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సాధించే అవకాశముందని, పశ్చిమ బెంగాల్‌లో అధికార ఆల్‌ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌తో బీజేపీకి తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు సూచించాయి. అలాగే తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) పదేళ్ల తర్వాత తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశముందని అంచనా వేశాయి. పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్.ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుందని పోల్స్ సూచిస్తున్నాయి.
అస్సాంలో బీజేపీ ఆధిపత్యం
అస్సాంలో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో ఉందని పలు సర్వేలు వెల్లడించాయి. యాక్సిస్ మై ఇండియా ప్రకారం బీజేపీ కూటమి 88-100 స్థానాలు సాధించే అవకాశముండగా, కాంగ్రెస్ కూటమి 24-36 స్థానాలకు పరిమితం కావచ్చు. పీపుల్స్ పల్స్ అంచనాల ప్రకారం ఎన్డీయేకు 68-72, కాంగ్రెస్‌కు 22-26 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. మ్యాట్రిజ్ ప్రకారం కూడా ఎన్డీయే ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. 126 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 64.
కేరళలో యూడీఎఫ్ రీ-ఎంట్రీ సూచనలు
కేరళలో యూడీఎఫ్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. యాక్సిస్ మై ఇండియా ప్రకారం యూడీఎఫ్ 78-90 స్థానాలు గెలవవచ్చు, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్) 49-62 స్థానాలకు పరిమితం కావచ్చు. పీపుల్స్ పల్స్ కూడా యూడీఎఫ్‌కే మెజారిటీ అవకాశాలు చూపింది. 140 స్థానాలున్న కేరళలో మెజారిటీ 71.
బెంగాల్‌లో హోరాహోరీ
పశ్చిమ బెంగాల్‌లో పోటీ తీవ్రంగా ఉండనుంది. పీపుల్స్ పల్స్ ప్రకారం టీఎంసీ 177-187 స్థానాలు గెలవొచ్చు. అయితే మ్యాట్రిజ్ పీ మార్క్ వంటి సంస్థలు బీజేపీకి ఆధిక్యం ఉంటుందని అంచనా వేశాయి. 294 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 148.
తమిళనాడులో డీఎంకే బలం
తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయని పోల్స్ సూచిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ ప్రకారం డీఎంకే కూటమి 125-145 స్థానాలు గెలవవచ్చు. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 65-80 స్థానాలకు పరిమితం కావచ్చు. అలాగే తమిళ వెట్రి కజగం కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తం 234 స్థానాల్లో మెజారిటీ 118.
పుదుచ్చేరిలో ఎన్డీయే ఆధిక్యం
పుదుచ్చేరిలో యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం ఎన్డీయే 16-20 స్థానాలు గెలవొచ్చు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి 6-8 స్థానాలు, టీవీకే 2-4 స్థానాలు పొందవచ్చు. మొత్తం 30 స్థానాలున్న అసెంబ్లీలో ఇది కీలక ఆధిక్యం.
ఓటింగ్ శాతం, ఎన్నికల ప్రక్రియ
ఈ ఎన్నికల్లో అస్సాం (85.38%), పుదుచ్చేరి (89.83%), తమిళనాడు (84.69%) రాష్ట్రాలు అత్యధిక పోలింగ్ నమోదు చేశాయి. పశ్చిమ బెంగాల్ తొలి దశలోనే 91.78% ఓటింగ్ నమోదైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఒకే దశలో పోలింగ్ జరగగా, బెంగాల్‌లో రెండు దశల్లో (ఏప్రిల్ 23, 29) ఎన్నికలు నిర్వహించారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు మే 4న వెల్లడికానున్నాయి.
రాజకీయ సమీకరణలు
అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా, కేరళలో యూడీఎఫ్ అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడులో డీఎంకే తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, బీజేపీ నుంచి గట్టి సవాల్‌ను ఎదుర్కొంటోంది. ఎగ్జిట్ పోల్స్ గతంలో కొన్ని సందర్భాల్లో తప్పుగా నిరూపితమైనా, తాజా అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.
