
ప్రధాని మోడీ ‘ఏడు విజ్ఞప్తులకు’ బీజేపీ మద్దతు: ఎన్. రామచందర్‌రావు
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన 'ఏడు విజ్ఞప్తులకు' తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పూర్తి మద్దతు ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనుగోళ్లను తగ్గించాలి, అవసరం లేని విదేశీ ప్రయాణాలను నివారించాలి అని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారని చెప్పారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంధన రేషన్ విధానం, ధరల పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం పరిస్థితిని మెరుగ్గా ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. అయినప్పటికీ ఆర్థిక స్థిరత్వం కోసం జాగ్రత్తలు తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధారణ పరిస్థితుల్లో కూడా ప్రజలను ఒక పూట భోజనం మానేయమని కోరిన చరిత్రను గుర్తుంచుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే ప్రధాని లక్ష్యమని, ప్రతి ఇంటి నుంచి ఈ పొదుపు మంత్రం ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు. రసాయన ఎరువుల దిగుమతుల కోసం దేశం భారీగా ఖర్చు చేస్తోందని, దీనిని తగ్గించడం పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని ఆయన వివరించారు.
