Let's talk: editor@tmv.in
బీజేపీ 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

బీజేపీ 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
2 జులై, 2026

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గడిచిన 12 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో సమాధానం చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై వివక్ష చూపుతూ, విభజన హామీలను సైతం అమలు చేయని బీజేపీకి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు లేదన్నారు. తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించి ఎన్నికల్లో ఓట్లు అడగాలని అన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు వచ్చినప్పుడు రాష్ట్రానికి కేంద్రం అందించిన ప్రయోజనాలు, అమలు చేసిన హామీల గురించి చెప్పాలని సూచించారు. తెలంగాణపై వివక్ష చూపుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని, తెలంగాణ ఏర్పాటును గతంలో అవహేళన చేసిన పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా బలహీనపడుతోందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలను ప్రజలు గమనించాలని, గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సహకారంతోనే బీజేపీకి పలువురు ఎంపీలు గెలిచారని ఆయన విమర్శించారు.

ఓట్ల తొలగింపుపై అప్రమత్తత

రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్‌వోలతో పాటు కాంగ్రెస్ తరఫున కూడా బీఎల్‌ఏలను నియమించి ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సహాయం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారమ్స్ ఇవ్వడం జరుగుతోందన్నారు.

ఇటీవల బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో లక్షలాది బీజేపీ వ్యతిరేక ఓట్లను అక్రమంగా తొలగించి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థలా మారిందనే చర్చ ప్రజల్లో నడుస్తోందని విమర్శించారు. అలాంటి పరిస్థితి తెలంగాణలో తలెత్తకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఎల్‌వోలు ఇంటికి వచ్చినప్పుడు అవసరమైన రెండు ఫొటోలు, ఇతర వివరాలను సిద్ధంగా ఉంచి నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి అర్హ ఓటు కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ట్యాగ్‌లు
PonnamPrabhakarCongressTelanganaBJPVoterListVoterVerificationElectionCommissionTelanganaPoliticsVoteMattersDemocracyTelanganaNews
బీజేపీ 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ - Tholi Paluku