Let's talk: editor@tmv.in
అయోధ్య రామమందిరం నిధుల వ్యవహారంపై బీజేపీ స్పందించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

అయోధ్య రామమందిరం నిధుల వ్యవహారంపై బీజేపీ స్పందించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
7 జులై, 2026

అయోధ్యలో రామ జన్మభూమి నిర్మాణం జరగాలని తొలిసారి శిలాన్యాసం వేసింది దివంగత ప్రధాని రాజీవ్ గాంధీనే అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని జిల్లెల్లగడ్డ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మార్కు ‘దేవుడి రాజకీయాల’పై రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు.

హిందువుల విశ్వాసమైన అయోధ్య రామాలయం కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది చందాలు ఇచ్చారని, కానీ అయోధ్య ట్రస్ట్‌లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. హుండీలను కొల్లగొట్టి, రాముని పేరుతో వసూలు చేసిన చందాలను దొంగిలించడం హిందువులందరికీ అవమానకరమన్నారు.

దేవుడి పేరు మీద, అక్షింతల పేరు మీద రాజకీయం చేస్తూ ఓట్లు అడిగిన బీజేపీ నాయకులను అయోధ్య ప్రజలే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పారు. ఈ దేవుడి స్కాంపై ప్రధాని మోడీ, అమిత్ షాలకు సన్నిహితులైన ట్రస్ట్ సభ్యులు, తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు నోరు విప్పడం లేదు? కిషన్ రెడ్డికి మజ్లిస్ ను తిట్టందే రాజకీయం నడవదని పొన్నం ప్రభాకర్ అన్నారు. తాము రామునికి వ్యతిరేకం కాదని, ఇల్లంతకుంట రామాలయంలో తాము ఎంపీగా ఉన్నప్పుడు ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం ఇప్పటికీ నడుస్తోందని గుర్తుచేశారు. ఈ అవినీతిపై బీజేపీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఓటరు సవరణ ప్రక్రియపై ప్రత్యేక పిలుపు

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఓటరు సవరణ ప్రక్రియ (స‌ర్) ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనదని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ ఎన్యూమరేషన్ ఫారాలు చేరాయని, బీఎల్ఏలు, బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ అర్హత గల ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలన్నారు. తాము స్వయంగా ఏడు మండలాలు తిరిగామని, పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో దీనిపై సమీక్ష జరిగిందన్నారు. ఓటర్ సవరణ కార్యక్రమం విజయవంతం కావాలని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ ఓటు హక్కును కాపాడుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు
PonnamPrabhakarAyodhyaRamMandirBJPTelanganaPoliticalNewsBreakingNewsTeluguNewsVoterListElectionCommissionSIRVoterVerification
అయోధ్య రామమందిరం నిధుల వ్యవహారంపై బీజేపీ స్పందించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ - Tholi Paluku