Let's talk: editor@tmv.in
తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజుల పర్యటన

తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజుల పర్యటన

Gaddamidi Naveen
27 జూన్, 2026

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నెల జూన్ 28 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన విద్యార్థులు, ఆదివాసీలు, పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులతో నిర్వహించే పలు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ విషయమై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నితిన్ నబిన్ ఈ 3 రోజుల పర్యటన.. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను, ఇక్కడ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే వారి దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు.

జాతీయ అధ్యక్షుడి పర్యటన షెడ్యూల్ వివరాలు

జూన్ 28న‌ శంషాబాద్‌లో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయాన్ని నితిన్ నబిన్ ప్రారంభించనున్నారు. అదే వేదిక నుంచి వర్చువల్ పద్ధతిలో మరో 10 జిల్లాల పార్టీ కార్యాలయాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. అనంతరం, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల బూత్ అధ్యక్షుల మహాసభలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు.

జూన్ 29న‌ హైదరాబాద్‌లో ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల సదస్సు లో పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్ పర్యటనకు వెళ్లి, అక్కడ ఆదివాసీలతో స్థానిక పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించే ప్రత్యేక సమావేశాల్లో భాగస్వామ్యమవుతారు. అలాగే జూన్ 30 రాష్ట్ర బీజేపీ పదాధికారుల కీలక సమావేశంలో పాల్గొని, ఆపై ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.

గత ఏడాది డిసెంబర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్.. అంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చారు. మే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ, ఈ నెలలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రంలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేసిన రామచందర్ రావు.. జాతీయ నేతల పర్యటనలు క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయన్నారు.

పాస్‌పోర్ట్ వివాదం - ఓవైసీ వ్యాఖ్యలపై కౌంటర్

పౌరసత్వ నిరూపణ, పాస్‌పోర్ట్ అంశంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై రామచందర్ రావు గారు తీవ్రంగా మండిపడ్డారు. పాస్‌పోర్ట్ అనేది విదేశీ ప్రయాణాల కొరకు జారీ చేసే ఒక పత్రం మాత్రమే తప్ప.. అది పౌరసత్వానికి తుది నిరూపణ కాదని 2013లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన గుర్తుచేశారు. టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా కూడా భారతదేశం జారీ చేసిన పసుపు రంగు పాస్‌పోర్ట్ (ఐడెంటిటీ సర్టిఫికేట్) కలిగి ఉన్నారని, అయితే ఆయన భారతీయ పౌరుడు కారని వివరించారు. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వ నిరూపణ కాదనే అంశం కొత్తది కాదని, గత 12 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో దీనిపై ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు కూడా స్పష్టం చేశాయన్నారు.

గతంలో సీఏఏ సమయంలో సమాజాన్ని ఎలాగైతే విభజించారో.. ఇప్పుడు కూడా కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి అదే తరహా మత ధృవీకరణ డ్రామాను మళ్లీ ఆడుతున్నాయని ఆరోపించారు. బారిస్టర్ చదువుకున్న ఓవైసీ లాంటి నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. ప్రస్తుత ప్రత్యేక ఓటర్ల సవరణ (స‌ర్) ప్రక్రియలో ఐడెంటిటీ ప్రూఫ్ కోసం పాస్‌పోర్ట్ సహా 12 రకాల పత్రాలను చూపించవచ్చని, పాస్‌పోర్ట్‌ను అంగీకరించబోమని ఎన్నికల సంఘం ఎక్కడా చెప్పలేదని రామచందర్ రావు స్పష్టం చేశారు. బీజేపీ ప్రజల పౌరసత్వాన్ని రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్, ఎంఐఎంలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.

ట్యాగ్‌లు
BJPNitinNabinTelanganaTelanganaPoliticsHyderabadBJP4TelanganaWarangalPoliticalNewsIndianPoliticsBreakingNewsTelanganaNewsBJPNews
తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజుల పర్యటన - Tholi Paluku