Let's talk: editor@tmv.in
నీట్ పేపర్ లీకేజీపై బీజేపీ సమాధానం చెప్పాలి: ఎంపీ అసదుద్దీన్

నీట్ పేపర్ లీకేజీపై బీజేపీ సమాధానం చెప్పాలి: ఎంపీ అసదుద్దీన్

Gaddamidi Naveen
14 మే, 2026

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అయోమయంగా మార్చినందుకు ప్రధాని మోడీ, బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం మీడియాలో మాట్లాడిన ఓవైసీ, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విద్య కోసం సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థుల ఆశలను ప్రభుత్వం దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. పేపర్ లీకేజీలపై పార్లమెంటులో కఠినమైన చట్టాలు తెచ్చామని, భారీ శిక్షలు ఉంటాయని గొప్పలు చెప్పుకున్నారు కదా.. మరి ఇప్పుడు పేపర్ ఎలా లీక్ అయింది? అని ఆయన ప్రశ్నించారు. గత రెండేళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి? లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు ధారపోసిన తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? అని నిలదీశారు. డాక్టర్ కావాలనే కలతో చదువుతున్న పేద విద్యార్థుల బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. దీనిపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నీట్‌ను రద్దు చేయాలి: పి. చిదంబరం

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం నీట్ పరీక్షా విధానంపైనే ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి ఒకేసారి పరీక్ష నిర్వహించడం వల్ల లీకేజీలకు అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, వైద్య ప్రవేశాల అధికారాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. 551 నగరాల్లో, వేల సంఖ్యలో ఉన్న కేంద్రాల్లో పారదర్శకత పాటించడం కష్టమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితి

మే 3న జరిగిన ఈ పరీక్షను ఎన్టీఏ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. మళ్లీ నిర్వహించే పరీక్షకు విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, ఎటువంటి అదనపు ఫీజు చెల్లించనక్కర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన కొనసాగుతోంది.