


రాహుల్ గాంధీ నివాసం ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా యత్నం
మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసం ఉన్న సునేహ్రి బాగ్ ప్రాంతానికి బీజేపీ మహిళా ఎంపీలు, అగ్రనేతలు, వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిపక్ష పార్టీలు మహిళా వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నాయని, మహిళలకు దక్కాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కాలరాస్తున్నాయని ఈ సందర్భంగా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ నిరసన ప్రదర్శనలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు ప్రముఖ నటి, మధుర ఎంపీ హేమమాలిని, ఎంపీలు కమల్జీత్ సెహ్రావత్, బన్సూరి స్వరాజ్, మంజు శర్మ, వాత్సల్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద నిరసనకారులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడి నుండి వారు రాహుల్ గాంధీ నివాసం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. చివరకు నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను (నీటి ఫిరంగులను) ప్రయోగించారు.
సునేహ్రి మసీదు రౌండ్‌అబౌట్ వద్ద బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఎంపీలు బన్సూరి స్వరాజ్, కమల్జీత్ సెహ్రావత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, మహిళలకు శాసనసభల్లో రిజర్వేషన్లు కల్పించకూడదని ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పాయని ఆరోపించారు. గత 30 ఏళ్లుగా ఈ బిల్లును ప్రవేశపెట్టిన ప్రతిసారీ చించివేయడం లేదా అడ్డుకోవడం ద్వారా దేశంలోని సగం జనాభా అయిన మహిళలను అవమానిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ హేమమాలిని మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ మహిళా శక్తికి ప్రాధాన్యత ఇస్తూ ఈ బిల్లు ఆమోదం కోసం ఎంతో కృషి చేశారని, కానీ ప్రతిపక్షాలు తమ సంకుచిత రాజకీయాల కోసం దానిని అడ్డుకున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలకు మహిళా శక్తిపై నమ్మకం లేదని, వారికి హక్కులు కల్పించడం ఇష్టం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో సుమారు 10,000 మంది మహిళలు పాల్గొన్నట్లు బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి రక్షా ఖడ్సేతో పాటు ఎంపీలు మనోజ్ తివారీ, రాంవీర్ సింగ్ బిధూరి కూడా ఈ నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేస్తూ, వారు ఒక "రాజకుటుంబం"లా ప్రవర్తిస్తున్నారని, వారి స్వంత కుటుంబ ప్రయోజనాలు తప్ప దేశ మహిళల సంక్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. మహిళలకు దక్కాల్సిన వాటాను అడ్డుకోవడం ద్వారా వారు చారిత్రక తప్పిదం చేశారని విమర్శించారు. ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ, ఇవాళ కాకపోయినా రేపైనా మహిళలు తమ హక్కులను సాధించుకుంటారని, బీజేపీ వారి కోసం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
శుక్రవారం లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ జరిగింది. 2029 నుండి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం, లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా, బిల్లుకు మద్దతుగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ (352 ఓట్లు) అవసరం. అయితే కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఈ కీలక బిల్లు వీగిపోయింది. దీనిపైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగుతోంది.
