Let's talk: editor@tmv.in
కుట్రలతో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం: సీఎం రేవంత్
కుట్రలతో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం: సీఎం రేవంత్

కుట్రలతో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం: సీఎం రేవంత్

Gaddamidi Naveen
9 మే, 2026

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ (సర్‌) పేరిట కుట్రలు చేస్తూ, అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. శుక్రవారం హజ్ యాత్రికులను తీసుకెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

బీజేపీ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు తెలంగాణలో పునరావృతం కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. నేరుగా ఇక్కడ ఏమీ సాధించలేక, కొందరు కుట్రపూరిత మార్గాల (స‌ర్) ద్వారా ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారు. అడ్డదారిలో రావాలనుకునే వారిని గుర్తించి అడ్డుకోవడంలో నేను ముందుంటాను అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎలాగైనా హైదరాబాద్‌ను హస్తగతం చేసుకోవాలన్నదే వారి ప్రధాన ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు.

దక్షిణాదిలో బీజేపీకి అడ్డుకట్ట

దక్షిణ భారతదేశంలో బీజేపీ బలోపేతం కాకుండా కాంగ్రెస్ అడ్డుకోగలిగిందని సీఎం చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆ పార్టీకి చోటు లేదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చంద్రబాబు నాయుడు మద్దతుతో అధికారంలో ఉందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన విమర్శించారు. తనకు హిందువులు, ముస్లింలు రెండు కళ్ల వంటివారని, ముస్లింలకు ఏ అవసరం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట

హజ్ యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం వివరించారు. ఇటీవల హజ్ యాత్రకు ముందు కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో విమాన ఛార్జీలను పెంచడంతో, 7,000 మంది హజ్ యాత్రికులపై పడే అదనపు భారాన్ని (ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున) రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గత ఏడాది సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదాన్ని గుర్తుచేసిన ముఖ్యమంత్రి, ఆ ఘటనలో 44 మంది హజ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మరణించిన ప్రతి యాత్రికుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు తెలిపారు. జీవితంలో ఒక్కసారైనా హజ్ వెళ్లాలని చాలా మంది భావిస్తుంటారని, హజ్‌కు వెళ్లిన వారు తెలంగాణకు మంచి జరగాలని ప్రార్థించాలని కోరుతూ సీఎం వారందరికీ మరోసారి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో తిరిగే ఆటో రిక్షాలకు ఉచితంగా ఎలక్ట్రిక్ రిట్రోఫిట్టింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గి పేద మైనారిటీ ఆటో డ్రైవర్లకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మారుస్తున్నామని, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.