Let's talk: editor@tmv.in
ఘాజీపూర్‌‌లో ఎస్పీ కార్యకర్తలపై దాడికి బీజేపీయే కారణం: అఖిలేష్ యాదవ్

ఘాజీపూర్‌‌లో ఎస్పీ కార్యకర్తలపై దాడికి బీజేపీయే కారణం: అఖిలేష్ యాదవ్

Pinjari Chand
28 ఏప్రిల్, 2026

ఘాజీపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కార్యకర్తలపై జరిగిన దాడికి బీజేపీ నాయకులు, ప్రభుత్వ అధికారులకు సంబంధం ఉందని అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ఈ ఘటన ప్రభుత్వ ప్రేరేపణతోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఘాజీపూర్‌లో ఏప్రిల్ 15న 17 ఏళ్ల బాలిక మృతదేహం లభించగా, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, బాధిత కుటుంబం త్వరితగతిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఏప్రిల్ 22న బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ఎస్పీ ప్రతినిధి బృందంపై గ్రామంలో రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు, పోలీసులు సహా గాయపడ్డారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రెస్‌మీట్‌లో అఖిలేశ్‌ మాట్లాడుతూ ఘాజీపూర్‌లో మా కార్యకర్తలతో దారుణంగా వ్యవహరించారు. ఇది ప్రభుత్వ సూచనలతోనే జరిగింది. ప్రభుత్వ అధికారులు, బీజేపీ నాయకులు ఇందులో భాగస్వాములని ఆరోపించారు. పీడీఏ (పిచ్ఛడ, దళిత్, అల్పసంఖ్యాక) వర్గాలకు మద్దతు ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంటోందని అన్నారు. పోలీసు దర్యాప్తుపై సందేహాలు వ్యక్తం చేస్తూ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఉన్నప్పటికీ ప్రజలు సంతృప్తి చెందడం లేదు. అన్ని కోణాల్లో విచారణ జరిగిందా? అని ప్రశ్నించారు.

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ నిధులు విశ్వకర్మ సంఘం. పార్టీ నుంచి సేకరించామని తెలిపారు. పార్టీ నేత రామ్ ఆస్రే విశ్వకర్మ, మహిళా విభాగం అధ్యక్షురాలు సీమా రాజ్‌భర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించనుందని చెప్పారు. చట్టం-వ్యవస్థ పరిస్థితుల దృష్ట్యా, జిల్లా యంత్రాంగం ఘాజీపూర్‌లో నిరసనలపై నిషేధాజ్ఞలు విధించింది. గ్రామానికి వెళ్లే ప్రవేశంపై కూడా పరిమితులు అమలు చేశారు. ఇదిలా ఉండగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అతిశయోక్తిగా చూపిస్తున్నాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్‌లపై కేసులు నమోదు చేయడాన్ని యాదవ్ ఖండించారు. మేము ఏదైనా పోస్టు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. కానీ మా పార్టీపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. మహిళల భద్రతపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగాయని ఆరోపించారు. మహిళల భద్రతపై ప్రభుత్వ హామీలు ఉత్త మాటలుగానే మిగిలిపోయాయని అన్నారు. ఈ సందర్భంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్రపై ఒక పుస్తకాన్ని కూడా ఆయన విడుదల చేశారు.