
ఇంధన ధరల పెంపుతో రైతులపై భారం మోపుతోంది బీజేపీ: మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారం మోపుతూ, రైతుల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు “రైతు గోస – బీజేపీ భరోసా” పేరుతో బస్సు యాత్రలు నిర్వహించడం పూర్తిగా రాజకీయ డ్రామాగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక వీడియోలో వ్యాఖ్యానించారు.
రైతుల సంక్షేమం గురించి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వ్యవసాయ వ్యయం భారీగా పెరిగిందని, ట్రాక్టర్లు, మోటార్ పంపులు, రవాణా ఖర్చులు అన్నీ పెరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులపై ప్రేమ చూపుతున్నట్లు బీజేపీ ప్రచారం చేయడం వాస్తవానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే బీజేపీ నేతలు ముందుగా కేంద్రంతో మాట్లాడి ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని మంత్రి ఆరోపించారు. బాయిల్డ్ రైస్ సాంక్షన్, లేవీ రైస్ అనుమతుల విషయంలో కూడా కేంద్రం సహకరించడం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని పదేపదే కోరుతున్నప్పటికీ కేంద్రం పరిమిత అనుమతులు మాత్రమే ఇస్తోందని మంత్రి చెప్పారు.
కేంద్రం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా 75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందని వివరించారు. అదనంగా పండిన ధాన్యానికి అనుమతి ఇవ్వకపోవడం రైతులపై ప్రభావం చూపుతోందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.8,749 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే 21 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, రైతుల ఆదాయం రెట్టింపు, పింఛన్లు వంటి అంశాలు అమలు కాలేదని విమర్శించారు. నల్ల చట్టాల తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసిన చరిత్ర బీజేపీదని, పారిశ్రామికవేత్తలకు పెద్దఎత్తున రుణమాఫీలు చేస్తూ రైతులను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మొక్కజొన్నకు క్వింటాకు కేవలం రూ.10 మద్దతు ధర పెంచి రైతులను అవమానించినందుకు కేంద్రం క్షమాపణ చెప్పాలన్నారు. ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేసేలా, అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా బీజేపీ నేతలను రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
