Let's talk: editor@tmv.in
గెలుపు జోష్‌లో బీజేపీ.. విజయవాడ వీధుల్లో భారీ ర్యాలీ

గెలుపు జోష్‌లో బీజేపీ.. విజయవాడ వీధుల్లో భారీ ర్యాలీ

Panthagani Anusha
6 మే, 2026

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం విజయవాడ నగరంలో బీజేపీ శ్రేణులు భారీ విజయ ర్యాలీని నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయ గీతాలు ఆలపించారు.

నగరంలోని భవానీపురం ప్రాంతం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారుల గుండా సాగింది. కార్యకర్తలు బీజేపీ జెండాలను చేతబూని ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నినాదాలు చేస్తూ నగరాన్ని హోరెత్తించారు.

బెంగాల్‌లో రౌడీ పాలనకు అంతం: పి.వి.ఎన్. మాధవ్

ర్యాలీని ఉద్దేశించి మాధవ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో సంవత్సరాలుగా కొనసాగుతున్న హింసాత్మక రాజకీయాలకు "రౌడీ పాలనకు" ప్రజలు ఈ తీర్పుతో చరమగీతం పాడారని విమర్శించారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పుట్టిన గడ్డపై బీజేపీ జెండా ఎగరడం చారిత్రాత్మకమని దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ నాయకత్వంపై ప్రజలకున్న బలమైన విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ డీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని అక్కడ నటుడు విజయ్ (టీవీకే) సాధించిన విజయాన్ని ఆయన స్వాగతించారు. కేరళలో సైతం బీజేపీ బలం పుంజుకుంటోందని అసెంబ్లీలో పార్టీ ప్రవేశం సాధించడం భవిష్యత్తు విస్తరణకు సంకేతమని పేర్కొన్నారు. అస్సాం, పుదుచ్చేరిల్లో హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో సాధించిన గెలుపు పార్టీ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అపోహలు పటాపంచలు.. అభివృద్ధికి పట్టం

ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ విజయం సాధించడం గమనించదగ్గ విషయమని మాధవ్ పేర్కొన్నారు. అల్పసంఖ్యాక వర్గాలు బీజేపీకి వ్యతిరేకం అనే ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని కేంద్ర పథకాలు, అభివృద్ధి చూసి అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారని ఆయన వివరించారు. అమిత్ షా వ్యూహరచన సునీల్ బన్సల్ వంటి నాయకుల పర్యవేక్షణ నిరంతరం శ్రమించిన కార్యకర్తల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయన కొనియాడారు.

ప్రస్తుతం దేశంలోని సుమారు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.