
బీజేపీ సిద్ధాంతపరంగా పోరాడేది కాంగ్రెస్‌తోనే: రాహుల్‌గాంధీ
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తనపై అనేక కేసులు నమోదు చేసినప్పటికీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారంలో భాగంగా శనివారం హుగ్లీ జిల్లా సేరంపూర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నన్ను ఐదు రోజుల పాటు 55 గంటలు ప్రశ్నించింది. మమతా బెనర్జీని ఎంతసేపు విచారించారు? అని ప్రశ్నించారు. తనపై ప్రస్తుతం 36 కేసులు ఉన్నాయని, బెయిల్‌పై బయట ఉన్నానని తెలిపారు. నా ఇల్లు తీసుకున్నారు, లోక్‌సభ సభ్యత్వం కూడా రద్దు చేశారు. ప్రతి 10–15 రోజులకు జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్ రాష్ట్రాలకు కేసుల కోసం వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.
మమతా బెనర్జీపై ఈడీ, సీబీఐ దర్యాప్తులు లేకపోవడం ఆమె బీజేపీకి నేరుగా వ్యతిరేకంగా పోరాడడం లేదనే సంకేతమని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ సిద్ధాంతపరంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీతోనే. ఎన్నికల సమయంలో మాత్రమే మమతపై విమర్శలు చేస్తారు, తర్వాత మౌనం వహిస్తారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు దెబ్బతిన్నాయని, నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు. బెంగాల్‌లో ఉద్యోగం రావాలంటే టీఎంసీతో సంబంధం ఉండాలి. లేకపోతే అవకాశం లేదని విమర్శించారు. గతంలో దేశానికి పరిశ్రమల కేంద్రంగా ఉన్న బెంగాల్‌ను మొదట వామపక్షం, తరువాత టీఎంసీ ప్రభుత్వం నాశనం చేశాయని అన్నారు.
అభివృద్ధి ఆగిపోయింది
హిందుస్తాన్ మోటార్స్ ఫ్యాక్టరీ మూసివేతను ఉదాహరణగా చూపిస్తూ, రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని తెలిపారు. శారద, రోజ్ వ్యాలీ వంటి ఫోంజీ స్కాంలు టీఎంసీ పాలనలోనే జరిగాయని, బొగ్గు స్మగ్లింగ్, అక్రమ గనుల తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. మహిళల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచారం-హత్య ఘటనను ప్రస్తావిస్తూ, టీఎంసీ పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని అన్నారు. 2021లో ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మమత హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఎవరికైనా ఉద్యోగం దొరికిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది యువత నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. చివరగా మమతా బెనర్జీ ప్రజల కోసం పనిచేసి ఉంటే బెంగాల్‌లో బీజేపీకి అవకాశమే ఉండేది కాదు. ఆమె బీజేపీకి మార్గం సుగమం చేస్తున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
