
రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ, ఈసీ కుట్ర: మీనాక్షీ నటరాజన్
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక అధికార బీజేపీ, ఎన్నికల సంఘం (ఈసీ) కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సాగుతున్న బీజేపీ కుట్రలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
మధ్యప్రదేశ్‌లో జూన్ 18న జరిగిన రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన ఏకైక అభ్యర్థిగా మీనాక్షీ నటరాజన్‌ను పోటి చేశారు. అయితే, అక్కడ మూడో స్థానాన్ని గెలుచుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, కేవలం అక్రమాలకు పాల్పడే ఉద్దేశంతోనే బీజేపీ తన మూడో అభ్యర్థి చేత నామినేషన్ వేయించిందని ఆమె ఆరోపించారు.
నామినేషన్ తిరస్కరణకు కారణం ఏంటి?
రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మీనాక్షీ నటరాజన్ సమర్పించిన అఫిడవిట్ అసంపూర్తిగా ఉందని, అందులో ఒక కోర్టు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను ఆమె దాచారని పేర్కొంటూ జూన్ 9న ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.
తెలంగాణలో నటరాజన్‌పై నమోదైన ఒక కేసు వివరాలను ఆమె అఫిడవిట్‌లో పేర్కొనలేదని బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత, జూన్ 11న బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీనిపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నామినేషన్ తిరస్కరణపై దాఖలు చేసిన పిటిషన్‌ను జూన్ 12న అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయితే, ఈ వ్యవహారంపై ఎన్నికల పిటిషన్ ద్వారా సవాలు చేసుకునే విసులుబాటును కోర్టు కల్పించింది.
కాంగ్రెస్ పార్టీ అంతా ఏకతాటిపైకి రావడం చూసి, భయభ్రాంతులకు గురిచేసే వ్యూహాలకు అక్కడ అవకాశం లేదని బీజేపీ గ్రహించిందని మీనాక్షీ నటరాజన్ పేర్కొన్నారు. అందుకే ఎన్నికల సంఘం అధికారులతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నాను.. ఇద్దరు రిటర్నింగ్ అధికారులు అమ్ముడుపోయారు. భారత ఎన్నికల సంఘం కూడా పూర్తిగా ప్రభావితమైంది. హైదరాబాద్ కోర్టు నాపై ఉన్న ఒక కేసును పరిగణనలోకి తీసుకుందని చెబుతూ నా నామినేషన్‌ను తిరస్కరించారు. కానీ వాస్తవానికి కోర్టు అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. నాపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదు. అది కేవలం ఒక ప్రైవేట్ ఫిర్యాదుపై వచ్చిన లీగల్ నోటీసు మాత్రమే. అది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని ఆమె పేర్కొన్నారు.
అఫిడవిట్ లోని 'ఫామ్ 26' లో పెండింగ్‌లో ఉన్న లీగల్ నోటీసుల గురించి ప్రస్తావించాలనే నిబంధన ఎక్కడా లేదని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఆ నోటీసు గురించి తాను అధికారులకు ముందే సమాచారం ఇచ్చానని, దానికి తానే స్వయంగా సమాధానం కూడా ఇచ్చానని వెల్లడించారు. ఈ అన్యాయంపై జూన్ 10న కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈసీఐని కలిసినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అందుకే తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని చెప్పారు. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హైకోర్టులో త్వరలోనే 'ఎన్నికల పిటిషన్' దాఖలు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
సొంత పార్టీ కుట్ర సిద్ధాంతాలు బూటకం
ఈ నామినేషన్ తిరస్కరణ వెనుక కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత కుట్ర ఉందంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ.. అవన్నీ బీజేపీ పుట్టించిన తప్పుడు కథనాలని కొట్టిపారేశారు. నేను ఇలాంటి పుకార్లను నమ్మను. మేము ఎన్నికల సంఘాన్ని, బీజేపీని ప్రశ్నించకుండా ఉండేందుకే వారు ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం పూర్తి ఐక్యంగా ఉంది. ఈ కుట్ర సిద్ధాంతాలన్నీ పూర్తిగా బూటకం, నిరాధారమైనవి అని తేల్చిచెప్పారు. అలాగే, తన కోసం తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేయబోతున్నారనే వార్తలను కూడా ఆమె ఖండించారు.
బీజేపీ ఇప్పుడు పార్టీల దొంగతనానికి తెరలేపిందని మండిపడ్డారు. దేశంలో 'వన్ నేషన్, వన్ పార్టీ' (ఒకే దేశం - ఒకే పార్టీ) విధానాన్ని తీసుకురావాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఒక వెక్కిరింతగా మార్చాలని వారు చూస్తున్నారని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్య అని ఆందోళన వ్యక్తం చేశారు.
బాధిత మహిళకు కాంగ్రెస్ అండ
హైదరాబాద్ కోర్టులో ఒక మహిళ దాఖలు చేసిన వేధింపులు, బెదిరింపుల పిటిషన్‌లో మీనాక్షీ నటరాజన్‌ను కూడా ఒక రెస్పాండెంట్‌గా చేర్చారు. అయితే, జూన్ 12న ఆ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. సంబంధిత లోకల్ కోర్టును ఆశ్రయించాలని సదరు మహిళకు సూచించింది.
ఆ పిటిషన్‌లో సదరు మహిళ ఒక కాంగ్రెస్ నాయకుడిపై శారీరక వేధింపులు, ప్రాణ బెదిరింపుల ఆరోపణలు చేయగా, అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ విషయంపై స్పందించిన నటరాజన్.. తాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆ బాధిత మహిళ వైపే ఉంటామని స్పష్టం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ సదరు నాయకుడిని అప్పట్లోనే డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించామని, ఆ తర్వాత పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశామని ఆమె వివరించారు.
