
కర్ణాటకలో బర్డ్ ఫ్లూ కలకలం: 44 నెమళ్ల మృతి.. 33 గ్రామాల్లో హై అలర్ట్
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ) వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 44 నెమళ్లు మృతి చెందడంతో అటవీ, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు.
ఏప్రిల్ 16 నుంచి 24 మధ్య కాలంలో బొమ్మనహళ్లి, కోలిహళ్లి, హిరేహళ్లి, కేసరమడు, గూలూరు గ్రామాల్లో నెమళ్లు మరణించాయి. తొలుత ఎండ వేడిమి వల్ల ఇవి మరణించి ఉంటాయని భావించినప్పటికీ, మృత నెమళ్ల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ జరిపిన పరీక్షల్లో వీటికి 'బర్డ్ ఫ్లూ' సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే, ఏప్రిల్ 23 తర్వాత కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
నివారణ చర్యలు..
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సవరించిన హెచ్5ఎన్1 కార్యాచరణ ప్రణాళికను కఠినంగా అమలు చేయాలని కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆదేశించారు. తుమకూరు జిల్లాతో పాటు అటవీ ప్రాంతాలు, జంతుప్రదర్శనశాలలు, పక్షి అభయారణ్యాలు, మగడి సరస్సు, కొక్కరె బెల్లూరు సంరక్షిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభావిత ప్రాంతం చుట్టూ 3 కిలోమీటర్ల వరకు సంక్రమిత మండలంగా, 10 కిలోమీటర్ల పరిధిని పర్యవేక్షణ మండలంగా గుర్తించారు. మొత్తం 33 గ్రామాలను హై అలర్ట్‌లో ఉంచారు. ఈ ప్రాంతాల్లో శుభ్రపరిచే చర్యలు, క్రిమిసంహారక మందుల పిచికారీ, కోళ్ల ఫారాలపై నిఘా, పక్షుల రవాణాపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
మానవ ఆరోగ్యంపై పర్యవేక్షణ
అటవీ, ఆరోగ్య, పశుసంవర్ధక శాఖల సంయుక్త బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాయి. సమీప గ్రామాల్లో 20 వేల మందికి పైగా ప్రజలపై ఇన్‌ఫ్లుయెంజా తరహా లక్షణాలు, తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లపై ఆరోగ్యశాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. ప్రస్తుతం మనుషుల్లో ఎలాంటి సంక్రమణ కేసులు గుర్తించలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన సిబ్బంది, స్థానికులను జాగ్రత్త చర్యగా పరిశీలనలో ఉంచారు. అనారోగ్యంగా ఉన్న లేదా మృతి చెందిన పక్షులను తాకవద్దని, పరిశుభ్రత పాటించాలని, అవసరమైతే రక్షణ పరికరాలు ఉపయోగించాలని, కోడి మాంసాన్ని కనీసం 80 డిగ్రీల సెల్సియస్‌కు మించి బాగా ఉడికించి మాత్రమే వినియోగించాలని ప్రజలకు సూచించారు.
