


ప్రపంచ నగరాలతో పోటీపడేలా 'భారత్ ఫ్యూచర్ సిటీ': సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ 'ప్రజా ప్రభుత్వం' ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం మీర్ఖాన్‌పేటలో సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రపంచస్థాయి నగరాలకు దీటుగా హైదరాబాద్ శివార్లలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖకు సంబంధించిన పలు కీలక కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు రాష్ట్ర ప్రగతిపై తన దార్శనికతను పంచుకున్నారు.
ఈ సందర్భంగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేయడంతో పాటు మల్కాజిగిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ పరిపాలనా బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం స్థానిక సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తదితరుల భాగస్వామ్యం కీలకమని అన్నారు. కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలో చేర్చాలనే డిమాండ్లు వచ్చాయని, గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు పంపిస్తే వాటిని పరిశీలిస్తామని తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీని కేవలం ఒక నగరంగానే కాకుండా, భవిష్యత్తు తరాలకు ఒక అద్భుతమైన అర్బన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం చెప్పారు. దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ దేశాల అభివృద్ధిని, సింగపూర్, న్యూయార్క్ నగరాల నమూనాలను తాము అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించామని, జూన్ 2 లోపు ఫ్యూచర్ సిటీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. గతంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు అసాధ్యమని విమర్శలు వచ్చినప్పటికీ అవన్నీ విజయవంతంగా అమలయ్యాయని గుర్తుచేశారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములు కోల్పోయే రైతులను ప్రభుత్వం సముచితంగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వారి పిల్లలకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అభివృద్ధి కోసం భూములు ఇచ్చే ప్రజలను గౌరవించాలనీ, వారి సమస్యలను సున్నితంగా పరిష్కరించాలనీ అధికారులకు సీఎం సూచించారు. నోటిఫికేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, చట్టపరంగా భూమి బదిలీ ప్రక్రియ ఆపడం సాధ్యం కాదని పేర్కొంటూ.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రైతులను కోరారు.
శంషాబాద్ - మెగా రవాణా హబ్
భారత్ ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్న శంషాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద రవాణా కేంద్రంగా మార్చబోతున్నట్లు సీఎం వెల్లడించారు. శంషాబాద్ ప్రాంతాన్ని బుల్లెట్ ట్రైన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని, మెట్రో రైలు, భారీ బస్ టర్మినల్ వంటి సదుపాయాలను కల్పించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు వేగంగా అమలు కావాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని చెప్పారు. పరిసర గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలనే ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామని, గ్రామ సభల ద్వారా తీర్మానాలు పంపితే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని సీఎం వివరించారు. కేంద్రం మంజూరు చేసిన మూడు హై-స్పీడ్ రైళ్లు (హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై) కోసం శంషాబాద్‌లో హై-స్పీడ్ రైల్ హబ్ ఏర్పాటు చేస్తాం. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ లేదా ఎలోన్ మస్క్ వంటి వారు సైతం ఇక్కడ పెట్టుబడులు పెట్టలేకపోయామే అని బాధపడేలా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
20 మంది మాజీ మావోయిస్టులకు 'గిరిదర్శక్' నియామక పత్రాలు
అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులను సమాజంలో గౌరవప్రదంగా భాగస్వామ్యం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న ముందడుగు వేసింది. మావోయిస్టుల అంశంపై మాట్లాడుతూ మావోయిస్టులను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు అగ్రనేత గణపతికి (ముప్పాల లక్ష్మణరావు) ఆరోగ్యం దృష్ట్యా ఆయన జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. లొంగిపోతే మెరుగైన వైద్యం, భద్రత కల్పిస్తామని చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులు కూడా లొంగిపోవాలని, వారిని ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. 2024 నుంచి ఇప్పటివరకు 814 మంది ఉద్యమాన్ని వీడి బయటకు వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.
20 మంది మాజీ మావోయిస్టు గిరిజన యువకులను 'గిరిదర్శకులు' (టూరిస్ట్ గైడ్లు) గా నియమిస్తూ, సీఎం ఈ సందర్భంగా నియామక పత్రాలను అందజేశారు. గతంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఈ యువతకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వీరు ఇకపై ఆయా జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. పర్యాటకులకు స్థానిక సంస్కృతి, చరిత్రను వివరించడం, అటవీ నియమాలను పాటించేలా చూడటం పర్యాటకుల భద్రతలో అధికారులకు సహకరించడం వీరి ప్రధాన విధులు. ఈ గిరిదర్శకులు ప్రత్యేకమైన యూనిఫామ్‌లను ధరించి తమ విధులను నిర్వర్తిస్తారు. ఒకప్పుడు మావోయిస్టులకు అడవిలో దారి చూపిన వాళ్లు.. ఇకనుంచి పర్యాటకులకు అద్భుతమైన ప్రదేశాలను చూపిస్తారు అని ప్రభుత్వం పేర్కొంది.
శాఖల సమన్వయం - శిక్షణ
ఈ వినూత్న కార్యక్రమం పోలీసు, గిరిజనాభివృద్ధి, పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల ఉమ్మడి చొరవతో సాధ్యమైంది. ఎంపికైన 20 మంది యువకులకు మరింత వృత్తిపరమైన నైపుణ్యం కల్పించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 6 నెలల పాటు 'సాఫ్ట్ స్కిల్స్' శిక్షణ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణ కాలంలో వారికి ప్రభుత్వం తరపున స్కాలర్‌షిప్‌లు కూడా అందజేయనున్నట్లు తెలిపారు.
సామాజిక మార్పుకు నాంది
తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు, ఆయుధాలు వీడిన యువతలో మనోధైర్యం నింపడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. వీరిని సమాజంలో భాగస్వామ్యం చేయడం వల్ల ఇతరుల్లో కూడా మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
