
భారతదేశంలో తీవ్రరూపం దాల్చుతున్న భానుడి ప్రతాపం
భారతదేశంలో వేసవి తీవ్రత అప్పుడే గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, రాబోయే నాలుగు నుండి ఐదు రోజుల పాటు దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలోని పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో, ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో వేడి గాలుల ప్రభావం జనంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఐఎండి అందించిన వివరాల ప్రకారం.. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో ఏప్రిల్ 20 నుండి 25 మధ్య వివిధ తేదీల్లో వడగాల్పులు విరుచుకుపడనున్నాయి. అలాగే మధ్య భారతంలోని విదర్భ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భానుడు సెగలు కక్కనున్నాడు. తూర్పు భారతదేశంలోని గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు, దేశంలోని తీర ప్రాంతాల్లో ఉక్కపోత సమస్య అధికంగా ఉండనుంది. ఏప్రిల్ 20 నుండి 26 వరకు పశ్చిమ బెంగాల్‌లోని గంగా మైదాన ప్రాంతాల్లో, అలాగే ఏప్రిల్ 22 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడితో కూడిన తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. అలాగే కేరళ, మాహే, తీర ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఏప్రిల్ 24 వరకు ఉక్కపోత కొనసాగుతుంది. గుజరాత్ తీర ప్రాంతాల్లో ఏప్రిల్ 24, 25 తేదీల్లో వేడి గాలి తీవ్రత అధికంగా ఉంటుంది. సాధారణంగా వడగాల్పుల కంటే హ్యుమిడిటీ (తేమ) ఎక్కువగా ఉన్నప్పుడు మనుషులపై శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే 'వార్మ్ నైట్' పరిస్థితులు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, వేడి వాతావరణం కొనసాగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం నాడు, ఒడిశాలో ఏప్రిల్ 22 వరకు రాత్రులు వేడిగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదు, ఇది వడదెబ్బ తగిలే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. పట్టణ ప్రాంతాల్లో కాంక్రీట్ భవనాల వల్ల ఈ వేడి రాత్రిపూట కూడా అలాగే నిలిచిపోతుంది.
ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అస్థిర వాతావరణం కారణంగా పిడుగులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. సోమవారం నాడు దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య, తూర్పు, వాయువ్య భారతంలోని కొన్ని చోట్ల మోస్తరు నుండి తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేడి, వర్షాల ఈ అసాధారణ కలయిక పంటలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
