
తెలంగాణలో భానుడి భగభగలు
తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరగడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దాటుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్త ధర్మరాజు వెల్లడించారు. రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొందని, రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల నుంచి 3డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
ఐఎండీ నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 41.4 డిగ్రీల, ఆదిలాబాద్‌లో 41డిగ్రీల నమోదయ్యాయి. మెదక్, హన్మకొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40డిగ్రీల పైనే ఉన్నాయి. రాజధాని హైదరాబాద్‌లో నిన్న గరిష్టంగా 40.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
దేశవ్యాప్త వాతావరణ పరిస్థితి
ఏప్రిల్ 15 నుంచి 20 వరకు తెలంగాణతో పాటు రాయలసీమ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గుజరాత్, తమిళనాడు, కేరళ, కోస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేడితో పాటు తేమతో కూడిన వాతావరణం నెలకొంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర భారతదేశంలో (జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్) మంచు కురిసే అవకాశం ఉండగా, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఎండలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా తగినంత నీరు తాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
