
ఏపీలో భానుడి భగభగ: 64 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా 64 మండలాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని సుమారు 64 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మండలాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లోని 252 మండలాల్లో ఎండల ప్రభావం తీవ్రంగా కనిపించింది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు జిల్లా గూడూరులో 45.5 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెదపారుపూడి, ఎన్టీఆర్ జిల్లా తోర్రగడిపాడులో 45.1 డిగ్రీలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు 44.1డిగ్రీలు, బాపట్ల జిల్లా కారంచేడు 44 డిగ్రీలలో కూడా భానుడు ప్రతాపం చూపాడు.
వర్షాల సూచన
దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ సింధుశాఖ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసి ఎండల నుంచి కొంత ఉపశమనం లభించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
