Let's talk: editor@tmv.in
పోటెత్తిన బెంగాలీ ఓటర్లు
పోటెత్తిన బెంగాలీ ఓటర్లు
పోటెత్తిన బెంగాలీ ఓటర్లు
పోటెత్తిన బెంగాలీ ఓటర్లు
పోటెత్తిన బెంగాలీ ఓటర్లు
పోటెత్తిన బెంగాలీ ఓటర్లు
పోటెత్తిన బెంగాలీ ఓటర్లు

పోటెత్తిన బెంగాలీ ఓటర్లు

Pinjari Chand
30 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ఘనంగా ముగిశాయి. రెండో, తుది దశలో 91.66 శాతం ఓటింగ్ నమోదవగా, రెండు దశలు కలిపి మొత్తం పోలింగ్ శాతం 92.47కు చేరింది. స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఓటింగ్ ఇదేనని అధికారులు తెలిపారు. దీంతో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ ఆధిపత్యం కొనసాగుతుందా? లేక బీజేపీ రాష్ట్రంలో పట్టు సాధిస్తుందా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. 142 నియోజకవర్గాల్లో జరిగిన రెండో దశ పోలింగ్‌లో భారీగా ఓటర్లు తరలివచ్చారు. కోల్‌కత్తాలో సుమారు 87% పోలింగ్ నమోదవగా, పూర్బ బర్ధమాన్ జిల్లా 92.46%తో అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్ 23న జరిగిన తొలి దశలో 93.19% పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.

సర్‌‌ ప్రభావం – ఓటర్ల జాబితాలో భారీ మార్పులు

ఈ ఎన్నికల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌‌) కీలక అంశంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 90.83 లక్షల పేర్లు తొలగించబడటంతో ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు తగ్గింది. ఈ మార్పు పోలింగ్ శాతం, రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో దశలో దక్షిణ బెంగాల్ జిల్లాలు—కొల్కతా, హౌరా, హుగ్లీ, నాదియా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు—ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే ప్రధాన ప్రాంతాలుగా మారాయి. మొత్తం 294 స్థానాల్లో 91 స్థానాలు ఈ ప్రాంతాలవే కావడం వల్ల ఫలితంపై ఇవి కీలక ప్రభావం చూపనున్నాయి.

భారీ ఓటింగ్‌ను టీఎంసీ తన సంక్షేమ పథకాలపై ప్రజల విశ్వాసంగా భావిస్తుండగా, బీజేపీ మాత్రం ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల ప్రతిఫలమని చెబుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే హింస తక్కువగా నమోదవడం గమనార్హం. దాదాపు 2,450 కంపెనీల కేంద్ర బలగాలు నియమించడం వల్ల శాంతియుత వాతావరణం నెలకొన్నట్టు అధికారులు తెలిపారు.

పోలింగ్ బూత్ వద్ద ఆర్‌జీ కార్ అత్యాచార-బాధితురాలి తల్లి..నెలకొన్న ఉద్రిక్తత; టీఎంసీ కార్యకర్తల నిరసనలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా, ఆర్‌జీ కార్ అత్యాచారం-హత్య కేసు బాధితురాలి తల్లి, బీజేపీ అభ్యర్థి రత్నా డేబ్‌నాథ్ పానిహాటి నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్‌ను సందర్శించినప్పుడు టీఎంసీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమెతో వాగ్వాదానికి దిగిన టీఎంసీ కార్యకర్తలు, బూత్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని డేబ్‌నాథ్ ఆరోపించారు. బూత్ నుంచి బయటకు వస్తున్నప్పుడు నడవడానికి ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధ మహిళను గమనించాను. ఆమె ఓటు వేయడానికి సహాయం చేయమని అక్కడ ఉన్నవారిని కోరాను. కానీ నేను బయటకు రావడంతోనే టీఎంసీ కార్యకర్తలు నాపై ఓటర్లను ప్రభావితం చేస్తున్నానని ఆరోపించి నన్ను అడ్డుకున్నారని ఆమె మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులను ఆదేశించినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే, స్థానిక టీఎంసీ నాయకుడు డేబ్‌నాథ్‌పై ఆరోపణలు చేస్తూ ఆమె ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించింది. ఎవరూ ఆమెను బెదిరించలేదు. ఆమె డ్రామా చేసిందని వ్యాఖ్యానించారు.

ఇతర ఆరోపణలు

సోదేపూర్ ప్రాంతంలోని మరో బూత్ వద్ద, ఈవీఎం‌లో బీజేపీ గుర్తు కనిపించకుండా నల్ల మషి ఉపయోగించారని డేబ్‌నాథ్ ఆరోపించారు. బటన్ నొక్కిన తర్వాత వచ్చే బీప్ శబ్దం కూడా వినిపించలేదని, యంత్రంలో లోపం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, బీజేపీ అభ్యర్థి నుంచి ఇలాంటి ఫిర్యాదు అధికారికంగా అందలేదని ఈసీ అధికారి తెలిపారు. ఆమె టీఎంసీ అభ్యర్థి తీర్తంకర్ ఘోష్, సీపీఎం అభ్యర్థి కలతన్ దాస్‌గుప్తలపై పోటీ చేస్తున్నారు.

పోలింగ్ తర్వాత భద్రత

పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు సుమారు 700 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు కొనసాగుతాయని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో ఈ బలగాలు మోహరించబడతాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇవి స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు కావని ఆమె విమర్శించారు. కేంద్ర బలగాలు ఓటర్లను, టీఎంసీ కార్యకర్తలను భయపెడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

టీఎంసీ ఎంపీల ఆరోపణలు

టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్, దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో కేంద్ర బలగాలు మహిళలు, పిల్లలపై లాఠీచార్జ్ చేశాయని ఆరోపించారు. అయితే, ఎన్నికల సంఘం ప్రకారం, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో గుంపును చెదరగొట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపింది.

ఈవీఎంలపై వివాదం

ఈవీఎంలపై టేపులు అంటించి గుర్తులను కప్పేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరుగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ అగర్వాల్ తెలిపారు. ఇది నిజమైతే రీ-పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ, కేంద్ర బలగాల ఉనికి వల్లే ప్రజలు ధైర్యంగా ఓటు వేస్తున్నారని అన్నారు. ప్రత్యేక పోలీసు పరిశీలకుడు అజయ్ పాల్ శర్మ పోలింగ్ ప్రాంతాలను పర్యవేక్షించారు. ఆయన చర్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి.

భవానీపూర్‌లో రాజకీయ ఉద్రిక్తత

ఈ ఎన్నికలలో ముఖ్య ఆకర్షణగా నిలిచింది భవానీపూర్. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మధ్య పోటీ తీవ్ర ఆసక్తి రేపింది. 2021 నందిగ్రామ్ పోరుకు ఇది ప్రతీకాత్మక రీమ్యాచ్‌గా భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సుమారు 87% పోలింగ్ నమోదవడం గమనార్హం.

పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. టీఎంసీ నేతలు కేంద్ర భద్రతా దళాలు ఓటర్లపై దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించగా, బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. కొన్ని బూత్‌లలో ఈవీఎంలపై టేప్‌లు అంటించి ఓటింగ్‌ను అడ్డుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ విషయంపై విచారణ అనంతరం అవసరమైతే రీ-పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. బెంగాలీ సినీ ప్రముఖులు కూడా పోలింగ్‌లో పాల్గొన్నారు. ప్రసంజిత్ చటర్జీ, మిథున్ చక్రవర్తి, దేవ్, క్రికెటర్‌‌ సౌరవ్‌గంగూలీ తదితరులు ఓటు వేశారు. అలాగే ఇటీవల ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల దాడిలో గాయపడ్డ ఎంపీ మితాలిబాగ్‌ కూడా వీల్‌ చైర్‌‌ పై వచ్చి ఓటు వేశారు.

పోటెత్తిన బెంగాలీ ఓటర్లు - Tholi Paluku