Let's talk: editor@tmv.in
బెంగాల్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం: ఎన్. రామచందర్‌రావు
బెంగాల్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం: ఎన్. రామచందర్‌రావు
బెంగాల్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం: ఎన్. రామచందర్‌రావు

బెంగాల్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం: ఎన్. రామచందర్‌రావు

Gaddamidi Naveen
5 మే, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం ఇచ్చిన ఉత్సాహంతో, తెలంగాణలోనూ అవే ఫలితాలు పునరావృతమవుతాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల‌ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కోసం సోమవారం పరేడ్ గ్రౌండ్స్‌లో ఆయన 'భూమి పూజ' నిర్వహించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అపూర్వ విజయాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు.

ప్రధాని పర్యటన ప్రాధాన్యత

ప్రధాని మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 'ఆపరేషన్ సిందూర్' విజయవంతమైన అనంతరం తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో రామచందర్ రావు మాట్లాడుతూ.. ప్రధాని పర్యటన చారిత్రాత్మకమని, ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు. మోడీ పాలన, బీజేపీ విధానాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే పార్టీకి బలమని ఆయన ధ్వజమెత్తారు. మోడీ దూరదృష్టి, సంక్షేమ పథకాలపై ప్రజలకున్న విశ్వాసమే ఈ విజయానికి కారణమన్నారు. బీజేపీ ఒక మతానికి వ్యతిరేకమన్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని, 'సబ్ కా సాత్ - సబ్ కా వికాస్' మంత్రంతో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. మమతా బెనర్జీ రౌడీ పాలనకు స్వస్తి పలికిన బెంగాలీ ప్రజలకు తెలంగాణ తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతమని పేర్కొన్నారు.

ఈ సభకు సుమారు రెండు లక్షల మంది హాజరవుతారని పార్టీ అంచనా వేస్తోంది. తొలుత ఈ సభకు 'జనాగ్రహ సభ' అని పేరు పెట్టినప్పటికీ, ప్రధాని అదే రోజున సుమారు రూ.8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నందున ఆ పేరును తొలగించారు. బీజేపీ ముఖ్య ప్రతినిధి ఎన్.వి. సుభాష్ ఈ పర్యటనను "అభివృద్ధి పండుగ"గా అభివర్ణించారు.

భూమి పూజ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, తెలంగాణ వృద్ధి పథంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాషాయ జెండాకు అండగా నిలబడతారని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.