

బంగ్లాదేశీ ముస్లింల చొరబాటుతో బెంగాల్‌కు ప్రమాదం.. హిమంత బిశ్వ శర్మ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాలింపాంగ్, దిన్హతాల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్ భవిష్యత్తును కాపాడుకోవాలంటే మమతా బెనర్జీని అధికారంలో నుంచి తొలగించడం తప్పనిసరి అని ఆయన వ్యాఖ్యానించారు.
మమతా బెనర్జీ ప్రభుత్వం బెంగాల్‌లోని వనరులను, ఖజానాను కేవలం "బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల" కోసమే మళ్లిస్తోందని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసమే ఆమె బెంగాల్ గడ్డను వారికి తాకట్టు పెట్టారని విమర్శించారు. ఒకవేళ మమతను అధికారంలో నుంచి దించకపోతే, భవిష్యత్తులో ఈ చొరబాటుదారులే బెంగాల్ రాష్ట్రాన్ని మన నుంచి లాక్కుంటారని ఆయన ప్రజలను హెచ్చరించారు. అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం చొరబాటును సమర్థవంతంగా అడ్డుకుందని, కానీ బెంగాల్‌లో మాత్రం చొరబాటుదారులు యథేచ్ఛగా వస్తున్నారని పేర్కొన్నారు.
గూర్ఖాలాండ్ అంశానికి పరిష్కారం..
ఉత్తర బెంగాల్ ప్రాంతం మమతా హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని హిమంత విమర్శించారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే చొరబాటుదారులందరినీ ఏరివేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గూర్ఖాల సమస్యపై స్పందిస్తూ.. గూర్ఖాలాండ్ అంశానికి బీజేపీ రాజ్యాంగబద్ధమైన పరిష్కారాన్ని చూపుతుందని, గూర్ఖాలకు న్యాయం చేస్తుందని ప్రకటించారు.
ఈసీకి ఫిర్యాదుపై స్పందన
అయితే, హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలు మతపరంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపిస్తూ టీఎంసీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆయన, ఇలాంటి ఫిర్యాదులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. అలాగే, బెంగాల్‌లో బాబ్రీ మసీదు తరహా నిర్మాణానికి ప్రయత్నించిన హుమాయూన్ కబీర్ ప్రస్తావన తెస్తూ.. ఒకవేళ అస్సాంలో అలాంటి ప్రయత్నం జరిగి ఉంటే తాను కఠిన చర్యలు తీసుకుని, సదరు వ్యక్తిని కటకటాల వెనక్కి పంపేవాడినని ఘాటుగా వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ సర్వనాశనమైందని, మార్పు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
