Let's talk: editor@tmv.in
దేశం కోసం 'ఆర్థిక యోధులు'గా మారండి: బూర నర్సయ్య గౌడ్

దేశం కోసం 'ఆర్థిక యోధులు'గా మారండి: బూర నర్సయ్య గౌడ్

Gaddamidi Naveen
12 మే, 2026

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించిన "ఏడు విజ్ఞప్తుల"ను బీజేపీ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సమర్థించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు ఒక 'ఆర్థిక యోధుడు'గా మారాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

ఆదివారం హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభ విజయవంతం అయ్యిందని పేర్కొన్న బూర నర్సయ్య, ప్రధాని సూచించిన మార్గదర్శకాలు దేశ ప్రగతికి దిక్సూచి అని కొనియాడారు. ఇరాన్ ఉద్రిక్తతలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి పరిణామాల వల్ల విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతోంది. మనం పెట్రోలియం, వంట నూనెలు, ఎలక్ట్రానిక్స్, బంగారం కోసం విదేశీ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నామ‌ని ఆయన వివరించారు. అందుకే అనవసరంగా బంగారాన్ని కొనడం తగ్గించాలని, తద్వారా వాణిజ్య లోటును తగ్గించి విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని ప్రధాని కోరినట్లు ఆయ‌న తెలిపారు.

ప్రధాని చేసిన విజ్ఞప్తులు

సికింద్రాబాద్ లో జరిగిన సభలో ప్రధానమంత్రి ప్రజలకు పలు సూచనలు చేశారు. వంటనూనెల వినియోగాన్ని తగ్గించడం, ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించడం, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం, బంగారాన్ని కొనడం తగ్గించాలని, స్వదేశీ ఉత్పత్తులను వినియోగించడం సహజ వ్యవసాయ విధానాల వైపు అడుగులు వేయడం ద్వారా దిగుమతుల భారం తగ్గించడంతో పాటు విదేశీ మారక నిల్వలను సంరక్షించవచ్చని వివరించారు.

విపక్షాల విమర్శలు

కాగా, ప్రధాని విజ్ఞప్తులపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనాలని ఆయన విమర్శించారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్ల బాధ్యత నుంచి తప్పుకోవడానికే ప్రభుత్వం ప్రజలపై భారం వేస్తోందని ఆరోపించారు. అయితే, ప్రపంచ అనిశ్చితి కాలంలో దేశాన్ని కాపాడుకోవడానికి ఇది 'ఆర్థిక ఆత్మరక్షణ' బాధ్యతాయుతమైన దేశభక్తి అని ప్రధాని అభివర్ణించారు.