Let's talk: editor@tmv.in
ఎన్డీయేతో అప్రమత్తంగా ఉండాలి: కేజ్రీవాల్

ఎన్డీయేతో అప్రమత్తంగా ఉండాలి: కేజ్రీవాల్

Pinjari Chand
22 ఏప్రిల్, 2026

ఎన్డీయే అధికారంలోకి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ చేసిన మంచి పనులను తక్కువ సమయంలోనే చెడగొడుతుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ హెచ్చరించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చెన్నైలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎన్డీయేతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొరపాటున ఆ కూటమికి ఓటేస్తే, గత ఐదేళ్లలో స్టాలిన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నాశనం అవుతాయని అన్నారు. బీహార్‌లో జరిగినట్లే, ఎన్డీయే గెలిస్తే తమకు అనుకూలంగా ఉండే ముఖ్యమంత్రిని నియమించుకునే అవకాశముందని వ్యాఖ్యానించారు.

గుజరాత్‌లో అభివృద్ధి అంతంతే

గుజరాత్‌లో బీజేపీ మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడలేదని ఆయన విమర్శించారు. బీజేపీ పాలించిన ప్రతి రాష్ట్రంలో అవినీతి పెరిగి, రాష్ట్రం నాశనమైందని ఆరోపించారు. ఢిల్లీలో తన అనుభవాన్ని ఉదాహరణగా చూపిస్తూ, గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల పనులను బీజేపీ ప్రభుత్వం చెడగొట్టిందని ఆయన అన్నారు. తమిళనాడులో కూడా అదే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ప్రజలు డీఎంకేకు ఓటు వేయాలని కోరారు. తమిళనాడు ప్రజలు బీజేపీ విభజన రాజకీయాలను ఇష్టపడరని, అందుకే ఆ పార్టీ రాష్ట్రంలో ఎదగలేకపోయిందని అన్నారు. ఈసారి బీజేపీ ఏఐఏడీఎంకేతో కలిసి 27 స్థానాల్లో పోటీ చేస్తోందని, ఆ పార్టీ పూర్తిగా బీజేపీ ఆధీనంలోకి వెళ్లిందని ఆరోపించారు.

స్టాలిన్‌ గళం బలంగా వినిపించారు

డీఎంకేపై వస్తున్న వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి ఆరోపణలపై స్పందిస్తూ, ముందుగా బీజేపీ తన పార్టీలో ఉన్న అంశాలను పరిశీలించుకోవాలని అన్నారు. డీలిమిటేషన్ బిల్లును ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించిన ఆయన, అది ఆమోదం పొందితే ప్రజాస్వామ్యం దెబ్బతినేదని చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత వల్లే ఆ బిల్లు ఓడిపోయిందని పేర్కొన్నారు. స్టాలిన్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, జాతీయ స్థాయిలో సంక్షోభాల సమయంలో, కేంద్రం ఫెడరలిజంపై దాడి చేసిన సందర్భాల్లో స్టాలిన్ గళం బలంగా వినిపించిందని అన్నారు. దేశ ప్రజాస్వామ్యం, రాష్ట్రాల హక్కుల కోసం ఆయన నిలబడ్డారని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు డీఎంకేకు మద్దతు ఇవ్వాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.

ఎన్డీయేతో అప్రమత్తంగా ఉండాలి: కేజ్రీవాల్ - Tholi Paluku