Let's talk: editor@tmv.in
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి: వాసుపల్లి గణేష్ కుమార్

ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి: వాసుపల్లి గణేష్ కుమార్

Gaddamidi Naveen
21 జూన్, 2026

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స‌ర్) ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికార కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం మై టీడీపీ యాప్‌ను ఉపయోగించి తమకు అనుకూలంగా లేని ఓట్లను, ముఖ్యంగా నిర్దిష్ట సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఓటర్ల జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 27, 31, 35 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), బూత్ లెవల్ అధికారులతో (బీఎల్వోలు) సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఫారం-7ను దుర్వినియోగం చేసి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని బీఎల్ఏలకు సూచించారు. అక్రమ ఓట్ల చేర్పు, చెల్లుబాటు అయ్యే ఓట్ల తొలగింపును అడ్డుకునేందుకు బూత్ స్థాయి కమిటీలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అవసరమైతే స్థానిక ఎన్నికల అధికారులతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు పెరిగాయని, ప్రతి కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా అని విమర్శిస్తూ, 2019 ఎన్నికల ముందు కూడా 40 నుంచి 45 లక్షల ఓట్లు తొలగిస్తే వైఎస్ జగన్ నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని సవరణలు చేస్తున్నారని, ఈ ఓట్ల తొలగింపులపై స్థానిక అధికారులకు, అవసరమైతే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పారదర్శకత కోసం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
VisakhapatnamVizagVisakhaSouthAndhraPradeshAPPoliticsAndhraPoliticsYSRCPVasupalliGaneshKumarVoterListVoterVerificationVoterRights
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి: వాసుపల్లి గణేష్ కుమార్ - Tholi Paluku