
ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే పై అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే (సర్) ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యదర్శులతో ఆన్‌లైన్ ద్వారా కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై పూర్తిస్థాయి సాంకేతిక అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తూ, పార్టీ మద్దతుదారుల ఓట్లు అన్యాయంగా తొలగించబడకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు.
గతంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇదే తరహా ప్రక్రియల పేరుతో పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపులు జరిగాయని సజ్జల ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఒకసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చడం కష్టతరమని ఆయన హెచ్చరించారు. బూత్ లెవల్ ఏజెంట్లు సాంకేతికంగా నైపుణ్యం కలిగి ఉండాలని బూత్ లెవల్ అధికారులుతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బి.ఎల్.ఏలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ఓరియెంటేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
బీహార్‌లో ప్రారంభమైన ఈ ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియ ప్రస్తుతం రెండో దశలో భాగంగా ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతోందని ఆయన వివరించారు. ఈ ప్రక్రియను అవకాశంగా తీసుకుని పార్టీ ఓటరు బేస్‌ను కాపాడుకోవడంతో పాటు బూత్ స్థాయి బలాన్ని పెంచుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, సమన్వయంతో పని చేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ సాధారణ ఎన్నికల్లోనూ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తూ ఆరోగ్యశ్రీ పథకం బలహీనపడటం, రైతు సమస్యలు, ఆసుపత్రుల సందర్శన వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నాయకులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలను నియోజకవర్గ స్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను సోషల్ మీడియా మరియు ప్రధాన మీడియా వేదికగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పెండింగ్‌లో ఉన్న పార్టీ కమిటీల ధృవీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
