Let's talk: editor@tmv.in
కేంద్ర మంత్రితో బీసీ జనార్థన్ భేటీ.. ఏపీ పోర్టుల అభివృద్ధిపై చర్చ

కేంద్ర మంత్రితో బీసీ జనార్థన్ భేటీ.. ఏపీ పోర్టుల అభివృద్ధిపై చర్చ

Gaddamidi Naveen
4 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పోర్టు ఆధారిత అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఢిల్లీలో కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ మంత్రి సర్భానందా సోనోవాల్‌తో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొని రాష్ట్ర ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మూలాపేట పోర్టు అభివృద్ధిలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ భాగస్వామ్యాన్ని పెంచాలని, రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి అవసరమైన ఉప్పు భూముల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.

అలాగే సాగర్‌మాల పథకం కింద గంగవరం పోర్టు, అనకాపల్లిలోని ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పోర్టుకు అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్‌మాల 2.0 కార్యక్రమం పరిధిలో ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు దుగ్గరాజపట్నం మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని అభ్యర్థించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర మారిటైమ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి, తూర్పు తీరంలో రాష్ట్రాన్ని ప్రధాన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జనార్థన్ రెడ్డి తెలిపారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమల భాగస్వామ్య సంస్థలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర మారిటైమ్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAPBCJanardhanReddySarbanandaSonowalRamMohanNaiduPortsPortDevelopmentSagarmalaSagarmala2MaritimeMaritimeInfrastructure
కేంద్ర మంత్రితో బీసీ జనార్థన్ భేటీ.. ఏపీ పోర్టుల అభివృద్ధిపై చర్చ - Tholi Paluku