Let's talk: editor@tmv.in
అనంతపురంలో బీసీ గళం సభ..కూటమి ప్రభుత్వంపై వైసీపీ ధ్వజం

అనంతపురంలో బీసీ గళం సభ..కూటమి ప్రభుత్వంపై వైసీపీ ధ్వజం

Panthagani Anusha
27 ఏప్రిల్, 2026

బీసీల హక్కులు, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో ‘బీసీ గళం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ బీసీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు రాయలసీమ ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పాలనలో భాగస్వామ్యులను చేశారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని రెండు సంవత్సరాలు గడిచినా బీసీలకు గణనీయమైన మేలు జరగలేదని విమర్శించారు. బీసీలకు సముచిత స్థానం కల్పించగల నాయకత్వం జగన్ మోహన్ రెడ్డిదేనని అభిప్రాయపడ్డారు.

అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, బీసీలు ‘బ్యాక్‌వర్డ్’ కాదు ‘బ్యాక్‌బోన్’ అని చాటి చెప్పిన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా బీసీ గర్జనలో ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన తర్వాత తూచాతప్పకుండా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డేనని గుర్తు చేశారు. బీసీల సంక్షేమం కోసం లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24 మంది మంత్రుల్లో 11 మందిని బీసీలకు అవకాశం కల్పించారని వివరించారు.

ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో బీసీలకు చేసిందేమిటని ప్రశ్నించిన ఆయన, అభివృద్ధి కంటే డైవర్షన్ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. ఎప్పుడూ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం, నారా చంద్రబాబు నాయుడును పొగడడం తప్ప బడుగు బలహీన వర్గాల సమస్యలపై దృష్టి పెట్టే పరిస్థితి లేదని ఆక్షేపించారు. బీసీలు ఐక్యంగా నిలిచి కూటమి ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూ రానున్న రోజుల్లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీసీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని చేసిన వాగ్దానం అమలు కాలేదని ప్రశ్నించారు. బీసీల అభ్యున్నతి కోసం బలమైన నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు.

ఈ సభలో ఎమ్మెల్సీలు భరత్, మంగమ్మ, శివరామిరెడ్డి, సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, తలారి రంగయ్య, ఈర లక్కప్ప, కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.