Let's talk: editor@tmv.in
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకుల భాగస్వామ్యం అవసరం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకుల భాగస్వామ్యం అవసరం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Gaddamidi Naveen
23 మే, 2026

తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు మరింత చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) త్రైమాసిక సమావేశంలో ఆయన పాల్గొని బ్యాంకింగ్ సంస్థలు, నాబార్డ్, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ రుణాలను కేవలం పంట రుణాలకే పరిమితం చేయకుండా మౌలిక వసతులు, విలువ ఆధారిత వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు విస్తరించాలని సూచించారు.

రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరాంతానికి మొత్తం డిపాజిట్లు రూ.9.43 లక్షల కోట్లకు, అడ్వాన్సులు రూ.12.33 లక్షల కోట్లకు చేరాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 130.78 శాతంగా నమోదై జాతీయ సగటును మించిందన్నారు. ప్రధాన రంగ రుణాలు రూ.4.09 లక్షల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.1.87 లక్షల కోట్లకు చేరడం సంతోషకరమని పేర్కొన్నారు. వ్యవసాయ రుణాల లక్ష్య సాధన 102 శాతం నమోదు కావడం అభినందనీయమన్నారు.

2025-26లో పంట రుణాల పంపిణీ రూ.75,486 కోట్లకు చేరి వార్షిక రుణ ప్రణాళికలో 84.34 శాతం లక్ష్యాన్ని సాధించిందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, మౌలిక వసతుల కింద రూ.1.68 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం లక్ష్య సాధన నమోదు కావడం బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతికి నిదర్శనమని చెప్పారు. అయితే ఇప్పటికీ అధిక భాగం రుణాలు స్వల్పకాలిక పంట రుణాలకే పరిమితమవడం ఆందోళనకరమన్నారు. ఉద్యానవనం, ఆయిల్ పామ్, సమగ్ర వ్యవసాయం, రక్షిత సాగు, పాడి, మత్స్య రంగాలకు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అవసరమని తెలిపారు.

గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ వ్యవసాయం, యాంత్రీకరణ రంగాలకు బ్యాంకులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రైతు రుణమాఫీతో గ్రామీణ రుణ సంస్కృతి పునరుద్ధరించబడిందని, రైతులు చెల్లింపుల్లో క్రమశిక్షణ పాటిస్తున్నారని తెలిపారు. వ్యవసాయ ఎన్‌పీఏలు 5.23 శాతం నుంచి 4.71 శాతానికి తగ్గడం రైతుల నిబద్ధతకు నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో దాదాపు వెయ్యి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీవోలు) పనిచేస్తున్నాయని, వీటికి వర్కింగ్ క్యాపిటల్, గిడ్డంగులు, డ్రోన్లు, ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. కౌలు రైతులకు సకాలంలో రుణాలు అందించడం ద్వారా ప్రైవేట్ అప్పులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందన్నారు. గ్రామీణ మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత వ్యవసాయ అభివృద్ధిలో తెలంగాణను జాతీయ ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు.