
బ్యాంక్ మోసం కేసు: ఆప్ నేత దీపక్ సింగ్లాను అరెస్ట్ చేసిన ఈడీ
బ్యాంక్ మోసం కేసు దర్యాప్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, గోవా ఆప్ సహ-ఇంచార్జ్ దీపక్ సింగ్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అరెస్ట్ చేసింది. అంతకుముందు రోజు ఉదయం నుంచే ఢిల్లీలోని సింగ్లా నివాసంతో పాటు గోవాలోని ఆప్ వాలంటీర్ల ఇళ్లలో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
పార్టీ డేటాను దొంగిలించే కుట్ర: ఆతిశీ
ఈ అరెస్ట్ ఈడీ సోదాలపై ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకురాలు, ఆప్ ఎమ్మెల్యే ఆతిశీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని, దీనిని తట్టుకోలేకే బీజేపీకి చెందిన అనుచర సంస్థలా ఈడీ వ్యవహరిస్తోందని, ఈడీని రంగంలోకి దించిందని ఆమె సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా మండిపడ్డారు. ఈ సోదాలు కేవలం మా కార్యకర్తలను భయపెట్టడానికి మాత్రమే కాదు.. మా పార్టీకి సంబంధించిన సంస్థాగత డేటాను దొంగిలించి, బీజేపీకి అప్పగించడానికి ఈడీ ద్వారా జరుగుతున్న కుట్ర అని ఆతిశీ ఆరోపించారు.
అదేవిధంగా ఆమె విడుదల చేసిన వీడియో సందేశంలో కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ఈడీ ద్వారా చర్యలు తీసుకున్నారని, ఆ సమయంలో ఐపాక్ వంటి సంస్థల కార్యకర్తలను అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత వారందరినీ విడుదల చేశారని కూడా ఆమె వ్యాఖ్యానించారు. బెంగాల్ తర్వాత పంజాబ్‌ను, ఇప్పుడు గోవాను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు.
పంజాబ్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, అక్కడ కూడా బీజేపీలో చేరడానికి నిరాకరించినందుకే పంజాబ్ మంత్రి, ఆప్ నేత సంజీవ్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసిందని.. అదే సమయంలో బీజేపీలో చేరిన మాజీ ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ వంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా, ఇటీవలే మే 9న పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా నివాసాలు, కార్యాలయాలపై రోజంతా సోదాలు నిర్వహించిన ఈడీ ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో గోవాలో కూడా ఆప్‌ను దెబ్బతీయడానికి దీపక్ సింగ్లాను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆతిశీ స్పష్టం చేశారు. ఈ బ్యాంక్ మోసం కేసు దర్యాప్తునకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
