
అణుశక్తి దిశగా బంగ్లాదేశ్ చారిత్రక అడుగు
బంగ్లాదేశ్ ఇంధన రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. ఆ దేశ కలల ప్రాజెక్టు అయిన రూప్‌పూర్ అణు విద్యుత్ కేంద్రంలో మంగళవారం కీలకమైన ఇంధన లోడింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. పద్మా నది తీరాన, ఇష్వర్ది ఉపజిల్లాలో నిర్మిస్తున్న ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి ఇదొక ప్రధాన మైలురాయిగా నిలవనుంది.
ఆగస్టు నుంచి వెలుగులు
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిబంధనల ప్రకారం దశలవారీగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే తాజాగా ఇంధన లోడింగ్‌ను చేపట్టారు. ప్రణాళిక ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు నాటికి రూప్‌పూర్ కేంద్రం నుంచి కనీసం 300 మెగావాట్ల విద్యుత్తు జాతీయ గ్రిడ్‌కు అందనుంది. ఇదే జరిగితే దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్ తర్వాత అణు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న మూడవ దేశంగా బంగ్లాదేశ్ రికార్డు సృష్టించనుంది.
రష్యా సహకారంతో భారీ ప్రాజెక్టు
సుమారు 12 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.1.13 కోట్లు) భారీ వ్యయంతో రష్యా ఆర్థిక, సాంకేతిక సహకారంతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రెండు యూనిట్ల ద్వారా మొత్తం 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఇంధన భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా ఈ ప్రాజెక్టును బంగ్లా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
లైసెన్స్ మంజూరు
యూనిట్-1 కార్యకలాపాల కోసం ఇప్పటికే ఏప్రిల్ 16న బంగ్లాదేశ్ అణుశక్తి నియంత్రణ సంస్థ కమిషనింగ్ లైసెన్స్‌ను మంజూరు చేసింది. ఇంధన లోడింగ్ తర్వాత సుమారు మూడు నెలల పాటు వివిధ స్థాయిల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ, ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి సామర్థ్యంతో గ్రిడ్‌కు సరఫరా చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎందుకీ ప్రాజెక్టు?
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల బంగ్లాదేశ్ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాంప్రదాయ వనరులపై ఆధారపడటం వల్ల విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థిరమైన, చౌకైన విద్యుత్ కోసం బంగ్లాదేశ్ అణుశక్తి వైపు మొగ్గు చూపింది. రష్యా సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు దేశ పారిశ్రామిక, గృహ అవసరాలకు భరోసానిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
