
బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే సంజయ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య ఉన్న "చీకటి ఒప్పందం" వల్లే కేసు నమోదై మూడు రోజులైనా అరెస్టు జరగలేదని ఆరోపించారు.
బండి సంజయ్ తన రాజకీయ ఎదుగుదల కోసం ధర్మాన్ని, దేవుడిని వాడుకుంటున్నారని వివేకానంద్ ధ్వజమెత్తారు. 2018కి ముందు భిక్షాటన చేసిన వ్యక్తికి నేడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ముసలి కన్నీరు కారుస్తూ, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ బీజేపీని రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారని విమర్శించారు. మైనర్ బాలికపై జరిగిన అకృత్యం విషయంలో హనీట్రాప్ అని మాట్లాడటం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు.
మైనర్ బాలిక తల్లిదండ్రులను బండి సంజయ్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాబట్టి ఎఫ్ఐఆర్ లో బండి సంజయ్ పేరును కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయమా? అని ప్రశ్నిస్తూ.. ఢిల్లీలో కుస్తీ పడుతున్నట్లు నటిస్తూ గల్లీలో దోస్తీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీల నాటకాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
