
బండి భగీరథ్ నిర్దోషిగా బయటకు వస్తాడన్న.. న్యాయవాది కరుణాసాగర్
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ పోలీసులకు లొంగిపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు హైకోర్టు న్యాయవాది కరుణాసాగర్ ఆధ్వర్యంలోని లీగల్ టీమ్ శనివారం రాత్రి సుమారు 8:10 గంటల ప్రాంతంలో ఒక టెక్ పార్క్ సమీపంలో భగీరథ్‌ను సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక కార్యాచరణ బృందానికి (ఎస్‌వోటీ) అప్పగించారు.
ఈ సందర్భంగా న్యాయవాది కరుణాసాగర్ మీడియాతో మాట్లాడుతూ.. తాము ముందుగానే లొంగిపోవాలని భావించామని, అయితే సీనియర్ న్యాయవాదుల సలహా మేరకు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. కోర్టు దానిని వాయిదా వేయడంతో, కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు తక్షణమే లొంగిపోయామని, ఈ కేసులో తాము ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్‌మెంట్
ఈ కేసులో శనివారం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కోర్టులో మేజిస్ట్రేట్ ముందు మైనర్ బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగినట్లు పోలీసులు తెలిపారు. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ ఎఫ్‌ఐఆర్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 74, 75 పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12 కింద కేసులు నమోదు చేశారు.
అయితే ఈ ఆరోపణలను భగీరథ్ ఖండిస్తున్నారు. తనపై నమోదైన కేసు ప్రతీకార చర్యలో భాగమని ఆయన ఆరోపించారు. బాలిక కుటుంబ సభ్యులు రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరించారని, డబ్బులు ఇవ్వకపోతే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుంటుందని హెచ్చరించారని పేర్కొంటూ కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో తానే ముందుగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
మరోవైపు, తనను, తన కుటుంబాన్ని ఈ కేసుతో అనుసంధానిస్తూ కొన్ని టెలివిజన్ ఛానళ్లు, యూట్యూబ్ వేదికలు, సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పరువునష్టం కలిగించే కంటెంట్‌ను తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రచారం నిలిపివేయాలని ఆయన కోర్టును కోరారు.
ఈ వ్యవహారంపై కే. కవిత స్పందిస్తూ, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. మరోవైపు, తన కుమారుడు తప్పు చేసి ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవని బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు.
