
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మధ్యంతర బెయిల్
పోక్సో కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన తన బీబీఏ పరీక్షలు రాసేందుకు వీలుగా కోర్టు శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 25 వరకు ఆయనకు ఈ తాత్కాలిక బెయిల్ వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ పోక్సో కేసుకు సంబంధించి మే 16వ తేదీ రాత్రి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, మేజిస్ట్రేట్ ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అంతకుముందు, ఈ కేసులో అరెస్ట్ నుంచి ముందస్తు రక్షణ కల్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.
ఒక 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 8వ తేదీన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. భగీరథ్ తన కుమార్తెతో ప్రేమాయణం సాగించాడని, ఆపై ఆమెను లైంగికంగా వేధించాడని సదరు మహిళ ఆరోపించారు. అనంతరం బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు, కేసులో మరికొన్ని కఠినమైన సెక్షన్లను చేర్చారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై భగీరథ్ కూడా పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు. ఆ బాలికే స్వయంగా తనకు పరిచయమైందని, వారి కుటుంబ శుభకార్యాలకు, స్నేహితుల కలయికలకు ఆహ్వానించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కుటుంబం నమ్మకమైనదని భావించి గ్రూపు సభ్యులతో కలిసి కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించానని భగీరథ్ తెలిపారు. అయితే, ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని సదరు బాలిక, ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారని, తాను నిరాకరించడంతో పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బు ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరించారని పేర్కొన్నారు. భగీరథ్ ఇచ్చిన ఈ ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
