Let's talk: editor@tmv.in
యూరియా అమ్మకాలపై బ్యాన్.. రైతు వ్యతిరేక చర్య: మాజీ మంత్రి హరీష్ రావు

యూరియా అమ్మకాలపై బ్యాన్.. రైతు వ్యతిరేక చర్య: మాజీ మంత్రి హరీష్ రావు

Gaddamidi Naveen
6 మే, 2026

రాష్ట్రంలో యూరియా అమ్మకాలపై ప్రభుత్వం అనధికారికంగా బ్యాన్ విధించడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు ఈ నిషేధమే నిదర్శనమని ఆయన విమర్శించారు. మంగళవారం తన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యూరియా అమ్మకాలను నిలిపివేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

యూరియా అమ్మకాలను నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని హరీష్ రావు పేర్కొన్నారు. డీలర్లు, అగ్రో సెంటర్లు, సహకార సంఘాల్లో తగినంత స్టాక్ ఉన్నప్పటికీ రైతులకు యూరియా ఎందుకు అందడం లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతులు కేంద్రాల చుట్టూ తిరుగుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. యూరియా సరఫరా నిలిచిపోవడంతో చెరకు, పండ్ల తోటలు, కూరగాయల సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం, కొత్త యాప్ ద్వారా మరిన్ని ఇబ్బందులు సృష్టించిందని విమర్శించారు. ఒకవైపు ఎరువుల ధరలు పెరగడం, మరోవైపు యూరియాపై అనధికారిక ఆంక్షలు విధించడం రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదన్నారు.

యూరియా సరఫరాపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం, వినియోగం తగ్గించాలని ప్రచారం చేయడం హాస్యాస్పదమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్లలో విఫలమైన ప్రభుత్వం రైతు వారోత్సవాలు నిర్వహించడం రైతులను అవమానించడమేనని అన్నారు. రైతుబంధు, బోనస్ చెల్లింపులు, పంట బీమా, రుణమాఫీ, యూరియా సరఫరా, పంట కొనుగోళ్లు వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. రైతు డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోలాగే యూరియా అమ్మకాలు నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకుని, అనధికారిక నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.