
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేస్తూ, కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ బదిలీల ప్రక్రియ 2026 మే 1 నుంచి మే 31 వరకు కొనసాగనుంది. 2026 జనవరి 1 నాటికి ఒకే చోట 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులు. అయితే, భార్యాభర్తల బదిలీలకు ఈ కాలపరిమితితో నిమిత్తం లేదు. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఒకేచోట నాలుగేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది.
వచ్చే ఏడాది మే 31లోగా ఉద్యోగ విరమణ చేసేవారికి స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప బదిలీలు ఉండవు. ఒకే కేడర్‌లో 40శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీల్లో పలు కేటగిరీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఆన్‌లైన్/వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నారు. ఈ విధానంలో భాగంగా ప్రతి ఉద్యోగి నుంచి 5 ఆప్షన్లను స్వీకరిస్తారు. భార్యాభర్తలు, వికలాంగులు, క్యాన్సర్, కిడ్నీ, హృదయ శస్త్రచికిత్స వంటి వైద్య కారణాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తారు. కఠినమైన ప్రాంతాల్లో సేవలందించిన వారికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. మొత్తం ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేసి, జూన్ 1, 2026 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం విధించనున్నారు.
