Let's talk: editor@tmv.in
బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి: మంత్రి కొండా సురేఖ

బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి: మంత్రి కొండా సురేఖ

Gaddamidi Naveen
9 జులై, 2026

ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. బల్కంపేటలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి, అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.

ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శిస్తే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బల్కంపేట బోనాలు ప్రతీకగా నిలుస్తాయని, ఈ ఉత్సవాల ద్వారా ఆలయ ఖ్యాతి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడించాలని ఆకాంక్షించారు.

ఈ నెల 20న సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవంతో కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయని, 21న ఉదయం అమ్మవారి కళ్యాణం, 22న సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో పోలీసు, ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ, టీజీఎస్‌పీడీసీఎల్, జలమండలి, వైద్యారోగ్య, అగ్నిమాపక, ఆర్టీసీ, సాంస్కృతిక, సమాచార పౌరసంబంధాల శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ప్రమాదాలు, ఇతర అపశృతులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి కేంద్రాలు, మొబైల్ మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్‌లు, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ మళ్లింపులు, పరిశుభ్రత చర్యలు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

భక్తుల సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పోలీసు శాఖకు సూచించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, సాంస్కృతిక శాఖ బోనాల వైభవాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించాలని, సమాచార పౌరసంబంధాల శాఖ ఉత్సవాల తేదీలు, ట్రాఫిక్ మళ్లింపులు, భక్తులకు అవసరమైన సూచనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఆదేశించారు. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.

ట్యాగ్‌లు
BalkampetEllammaBonalu2026AshadaBonaluEllammaTempleHyderabadTelanganaKondaSurekhaBonaluFestivalTelanganaCultureDevotional
బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి: మంత్రి కొండా సురేఖ - Tholi Paluku