
తెలంగాణలో బక్రీద్ సెలవు మార్పు
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బక్రీద్ పండుగకు సంబంధించిన ప్రభుత్వ సెలవు దినాన్ని మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన ప్రకారం మే 27వ తేదీ (బుధవారం) కాకుండా, సవరించిన తేదీ ప్రకారం మే 28వ తేదీ (గురువారం) నాటికి మారుస్తూ రాష్ట్రవ్యాప్తంగా సాధారణ సెలవు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖ ఇచ్చిన నివేదికలు, సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 (N.I. Act) ప్రకారం ఈ మార్పులు చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేరుతో ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ సవరించిన ఉత్తర్వుల ప్రకారం మే 27న యథాతథంగా కార్యాలయాలు పనిచేయనుండగా, మే 28న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకింగ్ పరిధిలోని స్థానిక ఆర్థిక సంస్థలకు సెలవు వర్తించనుంది.
