Let's talk: editor@tmv.in
కోర్టుకు రాకపోతే బెయిల్ రద్దు.. పంజాబ్ సీఎంకు హెచ్చరిక

కోర్టుకు రాకపోతే బెయిల్ రద్దు.. పంజాబ్ సీఎంకు హెచ్చరిక

Pinjari Chand
30 ఏప్రిల్, 2026

పరువు నష్టం కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ హాజరుకాకపోతే ఆయన బెయిల్‌ను రద్దు చేస్తామని స్థానిక కోర్టు బుధవారం గట్టి హెచ్చరిక జారీ చేసింది. తదుపరి విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు మంసా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాజిందర్ సింగ్ నాగ్‌పాల్ కోర్టు వెలువరించింది. ‘నజర్ సింగ్ మాన్షాహియా వర్సెస్ భగవంత్ మాన్ తదితరులు’ కేసు విచారణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.

కోర్టు గమనించిన దాంట్లో 2022 అక్టోబర్ 20 నుంచి ఇప్పటివరకు సీఎం మాన్ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదని పేర్కొంది. దీనివల్ల కేసు విచారణకు ఆటంకం కలుగుతోందని వ్యాఖ్యానించింది. ఈరోజు కూడా చండీగఢ్‌లో ముఖ్యమైన సమావేశం ఉందని చెప్పి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరగా, కోర్టు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించి, ప్రత్యక్షంగా హాజరు కావాలని స్పష్టం చేసిన విషయం గుర్తు చేసింది. అయితే, ఈసారి ఒకరోజు మినహాయింపు మంజూరు చేసిన కోర్టు, తదుపరి విచారణ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. లేకుంటే బెయిల్ రద్దు చేసి, బలవంతంగా కోర్టుకు తీసుకురావాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేసులో ఇతర నిందితుల్లో కొందరికి ఇప్పటికే పంజాబ్-హర్యానా హైకోర్టు నుంచి ఉపశమనం లభించగా, ఒక నిందితుడు మరణించడంతో కేసు ముగిసినట్లు కోర్టు పేర్కొంది. ఇక భారతీయ నగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), 2023లోని సెక్షన్ 273 కింద న్యాయవాది ద్వారా ప్రాతినిధ్యం వహించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన దరఖాస్తుపై మే 1లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

కోర్టుకు రాకపోతే బెయిల్ రద్దు.. పంజాబ్ సీఎంకు హెచ్చరిక - Tholi Paluku