
ప్రారంభానికి సిద్ధమైన బాచుపల్లి ఫ్లైఓవర్
ఉత్తర–పశ్చిమ హైదరాబాద్ ప్రజలకు భారీ ఊరట కలిగించే మరో కీలక మౌలిక సదుపాయ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెడుతూ, ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు బాచుపల్లి ఫ్లైఓవర్‌ను జూన్ 8న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఇక్కడ నిరంతరం వందలాది ఐటీ ఉద్యోగుల వాహనాలతో పాటు భారీ రవాణా వాహనాలు తిరుగుతుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతూ ఉంటాయి. బాచుపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రూ.71 కోట్లతో నిర్మించిన 1.3 కిలోమీటర్ల పొడవుతో, 4 లేన్లతో ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేశారు. ఈ సరికొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల మియాపూర్, నిజాంపేట్, మల్లంపేట్, బౌరంపేట్ ప్రాంతాల మధ్య ప్రయాణం ఎంతో సులువుగా మారనుంది. వాహనదారులకు ఎలాంటి సిగ్నల్స్ అడ్డంకులు లేకుండా (సిగ్నల్-ఫ్రీ) సురక్షితమైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఇది తీవ్ర ఉపశమనం కలిగించనుంది.
