

ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న బాబా రామ్‌దేవ్
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా యోగా గురువు బాబా రామ్‌దేవ్ రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి ప్రత్యేక యోగా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
యోగా గురువు బాబా రామ్‌దేవ్ జూన్ 19న నేడు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటారు. జూన్ 20న ఉండవల్లి గుహల సమీపంలో జరిగే ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొంటారు. అనంతరం జూన్ 21న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఎం చంద్రబాబును కలిసి యోగా ప్రాముఖ్యతపై చర్చించనున్నారు.
'యోగంధ్ర' - ఇంటింటా యోగా
రాష్ట్రంలో యోగాను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. 'యోగంధ్ర' కార్యక్రమాన్ని ప్రభుత్వ 'సంజీవని' ప్రజా ఆరోగ్య పథకంతో అనుసంధానించి, ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. నివారణ ఆరోగ్య సంరక్షణ శ్రేయస్సు, ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకమైన 'థెరప్యూటిక్ యోగా' కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2.6 లక్షల మందికి యోగాలో శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తులో అత్యుత్తమ యోగా శిక్షకులను గుర్తించి, వారికి ప్రత్యేక పురస్కారాలు అందించే విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకురానుంది. వచ్చే ఏడాదికి సంబంధించి 'ప్రతి ఇంటికి యోగా' అనే థీమ్‌తో ఏడాది పొడవునా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
భారీ స్థాయిలో వేడుకలు
జూన్ 21న విజయవాడలో జరిగే ప్రధాన వేడుకకు 5,000 నుండి 6,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే, అంబేడ్కర్ కళావేదిక వద్ద సుమారు 1,000 మందితో కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు జరగనుండగా, ఇప్పటికే కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అలాగే, జూన్ 18 నుండి 20 వరకు విజయవాడలో రాష్ట్రస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నారు.
యోగా @ డెస్టినేషన్' క్యాలెండర్ ఆవిష్కరణ
జూన్ 21న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'యోగా @ డెస్టినేషన్' క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తారు. ఇది వచ్చే ఏడాది జూన్ 21 వరకు రాష్ట్రంలో జరగబోయే వివిధ యోగా కార్యకలాపాలు, యోగా పర్యాటక ప్రాంతాల వివరాలను తెలియజేస్తుంది. ఈ క్యాలెండర్ ద్వారా ప్రజలను మరింతగా యోగా వైపు ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా యోగాను ఒక బలమైన శక్తిగా మార్చడానికి ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళుతోంది.
