
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రముఖ ఉద్యమ నేత, రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిద్దరితో గవర్నర్ కోటాలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పలువురు కేబినెట్ మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.
మైనార్టీల సంక్షేమంతో పాటు అన్ని వర్గాలకు కృషి చేస్తా: అజారుద్దీన్
ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి మైనారిటీల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారని, మంత్రిగా తాను మైనారిటీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రకటించారు.
గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసమే తనను మంత్రిని చేశారని, ఆ తర్వాత పదవి నుంచి తొలగిస్తారని బీఆర్‌ఎస్ చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. నా ఎమ్మెల్సీ నామినేషన్ ఆ విమర్శలు చేసిన వారి ముఖంపై చెంపపెట్టు వంటిది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఏప్రిల్ 30 లోగా సభలో సభ్యత్వం పొందని పక్షంలో మంత్రి పదవి కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, నాయకత్వంపై నమ్మకంతోనే తాను ధీమాగా ఉన్నానని మంత్రి వెల్లడించారు.
కోదండరాం స్పందన
మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన కోదండరాం నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కోదండరాంకు త్వరలోనే కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు సమాచారం. ఉద్యమ నేతగా ఆయనకున్న గుర్తింపును పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం మంత్రి పదవి అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల గడువు ముగిసేలోగా (ఏప్రిల్ 30) ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఏప్రిల్ 26న గవర్నర్ వీరిద్దరి పేర్లను ఆమోదించడంతో ఈ గడువు ముగియడానికి మూడు రోజుల ముందే ప్రమాణ స్వీకారం పూర్తయింది.
