
సామాన్యుడికి అందుబాటులో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు: మంత్రి సత్య కుమార్ యాదవ్
ప్రజారోగ్యమే పరమావధిగా ప్రతి గ్రామంలోనూ అత్యాధునిక వైద్య సదుపాయాలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ (విలేజ్ హెల్త్ క్లినిక్)ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్‌తో కలిసి వైభవంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పంతో దేశవ్యాప్తంగా ఏర్పాటవుతున్న ఈ ఆరోగ్య మందిరాలను దేవాలయాలంత పవిత్రంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ క్లినిక్ ద్వారా 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల అత్యవసర మందులను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా జిల్లా వ్యాప్తంగా వైద్య రంగ అభివృద్ధికి కేటాయించిన రూ.110 కోట్లలో ఒక్క అవనిగడ్డ నియోజకవర్గానికే సింహభాగం దక్కిందని మంత్రి తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 36 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను రూ. 9.40 కోట్ల వ్యయంతో బి.పి.హెచ్.యు కేంద్రాలను మంజూరు చేసి శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. దీనివల్ల స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని ధీమా వ్యక్తం చేశారు .
వైద్య రంగంలో రికార్డులు - ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించడమే ధ్యేయంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా మహిళా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రికార్డు స్థాయిలో 5.50 లక్షల మంది బాలికలకు ఒకే రోజు హెచ్ పీవీ వ్యాక్సినేషన్ అందించి దేశ వైద్య చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించిందని వెల్లడించారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలకు వరంలా మారిందని మంత్రి అభిప్రాయపడ్డారు. రవాణా ఖర్చు భారం తగ్గడంతో గ్రామీణ ప్రాంత మహిళలు ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రులకు వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీ శాతం 50 కంటే ఎక్కువగా పెరిగిందని ఆయన గణాంకాలతో వివరించారు.
స్వర్ణాంధ్ర - వికసిత్ భారత్ దిశగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశిస్తున్న 'స్వర్ణాంధ్ర ప్రదేశ్', ప్రధాని మోడీ కలల 'వికసిత్ భారత్' సాకారం కావాలంటే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధనలో ప్రజలందరి సహకారం అవసరమని ప్రతి ఒక్కరూ ఆరోగ్య పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్య శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
