

వైభవంగా ఏయూ శతాబ్ది సంబరాలు
అక్షరాల నిలయం, మేధావుల పురిటిగడ్డ ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శతాబ్ది ఉత్సవాలు విశాఖ తీరాన కన్నుల పండువగా జరిగాయి. వందేళ్ల చారిత్రక ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈ విద్యా దేవాలయం, తన శతాబ్ది వేడుకలను దేశ విదేశాల నుంచి విచ్చేసిన ప్రముఖులు, పూర్వ విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, నారా లోకేశ్, సచిన్ టెండూల్కర్, దర్శకుడు త్రివిక్రమ్, తదితరులు గౌరవ అతిథులుగా విచ్చేశారు. ఆచార్యులు, విద్యార్థుల మధ్య అట్టహాసంగా కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో భాగంగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని వారి కృషితోనే “వికసిత్ భారత్” సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను సరైన దిశలో మలచుకుంటేనే అద్భుతమైన విజయం సాధ్యమవుతుందని అందుకు క్రమశిక్షణతో కూడిన సమయ పాలన విజయానికి కీలకమని ఆయన సూచించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ శతాబ్ది ఉత్సవ చిహ్నాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిమను ఉపరాష్ట్రపతికి అందజేసి ఘనంగా సన్మానించారు.
ఏయూ ఒక అంతర్జాతీయ బ్రాండ్: ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉన్న వందేళ్ల ఘన చరిత్రను కొనియాడారు. ఏయూ కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదు అది ఒక గ్లోబల్ బ్రాండ్ అని ఆయన అభివర్ణించారు. స్వాతంత్య్రానికి పూర్వమే స్థాపించిన ఈ సంస్థ అభివృద్ధిలో విక్రమ్ దేవ్, గజపతి, పిఠాపురం, బొబ్బిలి వంటి రాజవంశాలు పోషించిన పాత్ర చిరస్మరణీయమని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తొలి కేబినెట్ సమావేశాన్ని ఇక్కడే నిర్వహించి ఈ సంస్థ పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు వంటి ఎందరో గొప్ప నాయకులను దేశానికి అందించిందని పేర్కొన్నారు.
రూ.500 కోట్ల నిధులు.. ప్రపంచ స్థాయి లక్ష్యాలు
విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం సీఎం భారీగా నిధులను ప్రకటించారు. ఏయూను దేశంలో టాప్-5, ప్రపంచవ్యాప్తంగా టాప్-100 ర్యాంకుల్లో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధులతో పాటు రూ.64 కోట్ల విలువైన ఏయూ ఐ-ఫ్యాక్టరీ, 'నెట్‌వర్క్ ల్యాబ్' వంటి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. అదనంగా రూ.112 కోట్లతో బాలుర, బాలికల హాస్టళ్లు, కాన్వొకేషన్ హాల్, వీసీ భవనం వంటి తొమ్మిది నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే విద్యా నాణ్యత పెంపు కోసం యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి: సచిన్ టెండూల్కర్ సందడి
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తన జీవిత అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం వర్సిటీ గర్వించదగ్గ పూర్వ విద్యార్థులు జి.ఎం.రావు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని విద్యార్థులు ఉద్యోగాలు వెతుక్కునే వారు కాకుండా, నూతన ఆవిష్కరణలతో ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం పిలుపునిచ్చారు. ఇప్పటికే 57 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని భవిష్యత్తులో ఏయూని మరిన్ని శిఖరాలకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
