
టీఎంసీ హయాంలో మహిళలపై దాడులు పెరిగాయి: ప్రధాని
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ముందు రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధికార టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హుగ్లీ జిల్లాలోని అరాంబాగ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన, టీఎంసీ తన ‘మా, మాటీ, మనుష్’ నినాదాన్ని మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కఠినమైన, నిస్సహాయ ప్రభుత్వం నడుస్తోందని, ప్రజల నమ్మకం పూర్తిగా కోల్పోయిందని అన్నారు. ప్రధాని మాట్లాడుతూ టీఎంసీ ప్రభుత్వం గూండాల చేతుల్లో నడుస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. ఇటీవల కోల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరోక్షంగా విమర్శలు చేస్తూ ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయని అన్నారు.
ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన ప్రస్తావన
కోల్‌కత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచారం-హత్య ఘటనను ఉదాహరణగా చూపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేక కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశంతోనే సీబీఐ దర్యాప్తు ప్రారంభమైందని అన్నారు. అలాగే టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ను ప్రస్తావిస్తూ ప్రతి కేసులో కోర్టుల జోక్యం అవసరం అవుతోంది అంటే ప్రభుత్వ విశ్వసనీయత సున్నా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ప్రధాని ఆరోపించారు. ప్రతిరోజూ అత్యాచారాలు, హత్యల వార్తలు వస్తున్నాయి. చాలాసార్లు టీఎంసీ నాయకుల ప్రమేయం కనిపిస్తోందని అన్నారు. బంగాళాదుంప రైతుల పరిస్థితిపై కూడా మోడీ విమర్శలు చేశారు. సిండికేట్లు రైతుల వద్ద కిలోకు రూ.2-3కు కొనుగోలు చేసి, మార్కెట్‌లో రూ.25-30కు విక్రయిస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీ హామీలు
భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం వస్తే మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. లక్‌పతి దిదీ పథకం ద్వారా 75 లక్షల మహిళలకు ఆదాయం పెంచే అవకాశాలు కల్పిస్తాం. ముద్ర లోన్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం భాగంగా ప్రధాని మటువా సమాజ ప్రధాన ఆలయం థాకూర్‌నగర్‌లోని థాకుర్‌బారి, అలాగే కొల్‌కత్తాలోని చారిత్రక తంతానియా కలిబరి ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. మటువా మహాసంఘం ప్రధాన కేంద్రం సందర్శించడాన్ని ఆ సమాజ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమాజం కనీసం 34 అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపుతుంది. అనంతరం ఉత్తర కొల్‌కత్తాలో సుమారు 2 కిలోమీటర్ల రోడ్‌షో నిర్వహించారు.
పోలింగ్ వివరాలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఇప్పటికే పూర్తవగా, సుమారు 91.78% ఓటింగ్ నమోదైంది. రెండో దశలో 142 నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తంగా, ఎన్నికల ముందు టీఎంసీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది.
