Let's talk: editor@tmv.in
పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై దాడి: వైసీపీ నేత రజిని

పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై దాడి: వైసీపీ నేత రజిని

Panthagani Anusha
4 మే, 2026

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాలన విధానం తీవ్రంగా మారిపోయిందని మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు హైకోర్టు ఆదేశాల మేరకు హాజరైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిపాలనకు విరుద్ధంగా “రెడ్‌బుక్” విధానం అమలవుతోందని అది ఇప్పుడు “బ్లడ్‌బుక్”లా మారిందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో రాజకీయ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని రజిని ఆరోపించారు. తాను కూడా అధికారంలో మార్పు వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ కేసును ఎదుర్కొన్నానని ఇది రాజకీయ వేధింపులలో భాగమని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు, పార్టీ కార్యకర్తలపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల్లో నేరాల సంఖ్య పెరిగిందని ముఖ్యంగా హత్యలు, హత్యాయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని రజిని తెలిపారు. జర్నలిస్టులు సహా వివిధ వర్గాలపై కేసులు నమోదవుతున్నాయని ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థ తటస్థంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

చిలకలూరిపేటలో ప్రజా సమస్యలపై స్పందిస్తే స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని విద్యుత్ చార్జీల పెంపు వంటి అంశాలపై నిరసనలు చేపట్టినందుకు తనపై కేసులు నమోదు చేశారని ఆలయం నుంచి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన ఘటనలో కూడా తనపైనే కేసు పెట్టారని తెలిపారు.

ప్రతిపక్షాల స్వరం అణచివేయడానికి అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని రజిని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. అక్రమ కేసులకు తాము భయపడబోమని స్పష్టం చేస్తూ, న్యాయం చివరకు గెలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.